ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతూ నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో నెల్లూరులో నెక్లెస్ రోడ్డు నిర్మించారు. స్వర్ణాల చెరువు వద్ద గత ప్రభుత్వం హయాంలో ఈ పనులు ప్రారంభం కాగా.. అమృత పథకం కింద 25 కోట్ల రూపాయల నిధులను వెచ్చించి నెక్లెస్ రోడ్ వద్ద పలు అభివృద్ధి పనులు పూర్తి చేశారు. అప్పటి అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వం వెరసి గుత్తేదారు నాసిరకంగా నిర్మాణాలు చేసి, చేతులు దులుపుకున్నారు.
ఎన్నికల హడావుడితో ప్రారంభించిన మూడు నెలలకే రోడ్డు నాణ్యత బట్టబయలైంది. చెరువు మట్టినే వినియోగించి కట్ట పోయటం, దానిపైనే రోడ్డు నిర్మించటంతో పేరుకు సిమెంట్ రోడ్డే అయినా కుంగిపోయి బీటలు బారింది. కనీస నాణ్యత ప్రమాణాలు పాటించకపోవటం రోడ్డంతా పగిలిపోయి, మట్టికట్ట సైతం కోతకు గురైంది. ప్రస్తుత పాలకులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి భారీగా అవినీతి జరిగిందని, విచారణ జరిపించి నెక్లెస్ రోడ్ను పునరుద్ధరిస్తామని ఏడాది క్రితం ప్రకటించారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి పునరుద్ధరణ పనులు చేపట్టకపోగా, కనీసం లైట్లు కూడా ఏర్పాటు చేయని పరిస్థితి నెలకొంది.
ఇక్కడ ఏర్పాటు చేసిన మహనీయుల విగ్రహాలు సైతం ముళ్ళకంపల మాటున దర్శనమిస్తున్నాయి. పరిసరాలు ఆపరిశుభ్రంగా ఉండటం.. అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతోంది. నగరవాసులు సేద తీరేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందనుకున్న నెక్లెస్ రోడ్.. ఎందుకు పనికి రాకుండా పోతోంది. ప్రస్తుత పాలకులైన ఈ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చూడండి...