MLA Kotam Reddy warned : ప్రజా సమస్యలపై గెరిల్లా తరహా ఉద్యమాలు చేస్తాం.. ప్రభుత్వం, అధికార యంత్రాంగంపై ఒత్తిడికి పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం అని నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై ఇక నుంచి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఉద్యమిస్తామని ఆయన స్పష్టం చేశారు. గృహ నిర్బంధం చేసి ప్రజా ఉద్యమాలను పోలీసులు ఆపలేరని గట్టిగా చెప్పారు. క్రిస్టియన్ సోదరుల కోసం కమ్యూనిటీ హాలు నిర్మాణానికి 150 అంకణాల స్థలాన్ని కేటాయించారని, ప్రభుత్వాన్ని 7 కోట్ల రూపాయలు కావాలని కోరితే సీఎం జగన్ అంగీకరించారని తెలిపారు. నిధులు ఇవ్వాలని మూడు వినతి పత్రాలపై ముఖ్యమంత్రి జగన్ సంతకాలు కూడా చేశారని చెప్పారు. నాలుగేళ్లవుతున్నా నిధులకు అతీగతీ లేదని తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి క్రిస్టియన్ సోదరుల నుంచి పది రోజులుగా విజ్ఞాపనలు పంపామని చెప్తూ.. అయినా స్పందించక పోవడంతో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చాం అని ఎమ్మెల్యే కోటంరెడ్డి వెల్లడించారు. నిరసన కార్యక్రమాన్ని, ఏర్పాట్లను పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు.
కమ్యూనిటీ హాల్ కావాలని అనేక రకాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. అదే విధంగా మైనార్టీ సోదరుల కోసం షాదీఖానా కావాలని అడిగాం. ఆ మేరకు స్థలాలు కేటాయింపు కూడా పూర్తయ్యింది. కానీ, నాలుగేళ్లవుతున్నా నిధులు విడుదల చేయడం లేదు. ప్రజల పక్షాన పోరాటాలు కొనసాగిస్తాం. సమస్యల పరిష్కారానికి గెరిల్లా తరహాలో ఉద్యమిస్తాం. -కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే
ఇటుకలు తెచ్చి నిరసన: పోలీసులు అడ్డుకున్నంత మాత్రాన నిరసనలు ఆగవని పాస్టర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం పోరాటం చేస్తున్న ఎమ్మెల్యేని పాస్టర్లు అభినందించారు. గృహనిర్బంధంలో ఉంచడానికి నిరసనగా.. గొడుగులతో మాగుంటలోని కార్యాలయానికి పాస్టర్లు తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రతి చర్చి నుంచి ఓ ఇటుకను తీసుకువచ్చారు. టీడీపీ నాయకుడు గిరిధర్ రెడ్డితో కలిసి పెద్ద ఎత్తున తరలివచ్చిన ఫాస్టర్లు నిరసనలో పాల్గొన్నారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలోని గాంధీనగర్‌లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రెండేళ్ల కిందట 150అంకణాల స్థలం కేటాయించారని తెలిపారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ముఖ్యమంత్రి నుంచి నిధులకు అనుమతులు తీసుకున్నా మంజూరు కాలేదని చెప్పారు. నిర్మాణం ప్రారంభించకపోవడంతో అనేకసార్లు నిరసనలు తెలిపామని, పది రోజులుగా ప్రభుత్వానికి ఫాస్టర్ల ద్వారా అనేక వినతులను పంపించామని వెల్లడించారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ రోజు ప్రతి చర్చి నుంచి ఇటుకను తీసుకురావాలని పిలుపునిచ్చామని చెప్పారు.
ఇవీ చదవండి :
- Avinash bail : అవినాష్‌కు లభించని ఊరట.. అరెస్టు చేయొద్దని సీబీఐని ఆదేశించలేమన్న సుప్రీం
- Scams in the name of part-time job : యూట్యూబ్‌లో లైక్ కొడితే డబ్బులు..! విజయవాడ సాఫ్ట్ వేర్ ఉద్యోగినికి షాక్
- 195 Years Old Teak Trees: వనంలో 'రామలక్ష్మణులు'.. అటవీ అధికారుల మల్లగుల్లాలు..!