Minister Meruga Nagarjuna Comments on Social Welfare Hostels: రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ఎంత దారుణంగా ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. సరైన వసతులు లేక, మంచి ఆహారం అందించక, హాస్టళ్లను మెయింటైన్ చేసేవారు లేక వాటి పరిస్థితి అధ్వానంగా తయారయ్యాయి. గత 15 రోజుల క్రితం ఓ అధికారే వసతి గృహాల పరిస్థితిని చూసి నివ్వెర పోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక మరోవైపు హాస్టళ్లను బాగు చేయాలని, సరైన వసతులు కల్పించాలని, మంచి ఆహారం అందించాలని చాలా చోట్ల విద్యార్థులు ధర్నా చేసిన విషయం తెలిసిందే. తాజాగా కడపలోని ప్రకాశ్ నగర్ కాలనీలోని ఎస్సీ సంక్షేమ వసతి గృహంలో భోజనం బాగా లేదంటూ రాత్రిపూట వర్షంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
Minister Meruga Nagarjuna Press Meet: అయితే తాజాగా ఆ శాఖ మంత్రి మేరుగ నాగార్జున చేసిన వ్యాఖ్యలు వెల్ఫేర్ హాస్టళ్ల పరిస్థితికి అద్దం పడుతోంది. నెల్లూరులో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. హాస్టళ్లలో మౌలిక సదుపాయాలపై చేసిన కామెంట్లు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ శాఖ(సోషల్ వెల్పేర్) వసతి గృహాలు కొంత బాగాలేని మాట వాస్తవమేనని మంత్రి మేరుగ వెల్లడించారు. అయితే గత తెలుగుదేశం ప్రభుత్వంతో పోల్చుకుంటే మాత్రం హాస్టల్స్ పరిస్థితి మెరుగుపడిందని ఆయన వ్యాఖ్యానించారు. నాడు- నేడు కింద వసతి గృహాల రూపు రేఖలు మార్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.
"రాష్ట్రంలో కార్పొరేట్, ఇతర వసతి గృహాల్లో ఉన్న మౌలిక సదుపాయాలతో పోల్చుకుంటే.. సాంఘిక సంక్షేమ వసతి గృహాల పరిస్థితి కొంత మేర బాగాలేని మాట వాస్తవమే. నాడు నేడు కింద వాటి రూపు రేఖలు మార్చేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది." -మేరుగ నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
Minister Meruga Nagarjuna on Vinukonda Issue: అలాగే పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన పరిస్థితులపై కూడా ఆయన స్పందించారు. వినుకొండలో వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, నాయకులపై తెలుగుదేశం నాయకులు దాడులకు పాల్పడి.. పైపెచ్చు తమ పార్టీ నేతలపైనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెట్టలేక ఇతర పార్టీలతో పొత్తులకు వెళ్తోందని ఎద్దేవా చేశారు. అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను మాత్రమే కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తోందని.. ఈ విషయంపై పురందేశ్వరి తెలిసీ తెలియకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాజ్యాంగబద్ధంగా ఎస్సీలకు రావాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తమకే ఖర్చు చేస్తోందని మంత్రి మేరుగ తెలిపారు.