ఆంధ్రా-తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన తడలో కొత్త ఏడాది సంబరాలలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. అర్థరాత్రి తమిళనాడు రాష్ట్రం మాదరపాకంకు చెందిన ఇద్దరు యువకులు నెల్లూరు జిల్లా తడలోని ఓ హోటల్లో మద్యం సేవిస్తున్నారు. అక్కడే స్థానిక యువకులు మద్యం తాగుతున్నారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగింది.
తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు... స్థానికులపై కత్తులతో దాడికి యత్నించారు. స్థానికులు వారిపై తిరగబడ్డారు. స్థానికుల దాడిలో ఇద్దరు తమిళనాడు వాసులకు తీవ్రగాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఒకరిని సూళ్లూరుపేట, మరొకరిని తమిళనాడులోని ఆస్పత్రికి తరలించారు.
దాడి జరిగిన చోట కత్తులు, పేలుడు వస్తు సామగ్రి ఉండటంతో పోలీసులు కూపీ లాగే పనిలో పడ్డారు. తడ ఎస్సై వేణు తమిళనాడుకు వెళ్లి గాయపడిన వారి వివరాలు తెలుసుకుంటున్నారు. లారీలలో చోరీకి పాల్పడే ముఠాకు చెందిన వ్యక్తులుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదీ చదవండి: కడప వైకాపాలో వర్గ పోరు...గాల్లోకి ఓ వర్గం నేత కాల్పులు