Nellore rains: నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గూడూరు - మనుబోలు మధ్య పంభలేరు వరద ప్రవాహంతో 16వ నెంబరు జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. కండలేరు డ్యామ్ నుంచి వరద నీరు రావడంతో సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు చెరువు నిండుకుండలా మారింది. చెర్లోపల్లి గ్రామంలో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. కాలువలు బలహీనపడి పలు ఇళ్లలోకి నీరు చేరడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ మహిళ నీట మునిగిన తన ఇంటిని చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. చెరువు తూము చెక్కలను పైకి లేపకపోవడంతో నష్టం జరిగిందని వాపోయారు.
Rains in AP: నాయుడుపేట పరిసరాల్లో కురుస్తున్న అతి భారీ వర్షాలకు పంటల పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఊళ్లకు ఆనుకుని భారీగా నీరు చేరటంతో నివాసాల పరిస్థితి దయనీయంగా మారింది. పశువులు ఆహారం కోసం అలమటిస్తున్నాయి. బయట మేసేందుకు ఎక్కడ చూసినా నీరు నిలిచి ఉండటంతో మృతి చెందే పరిస్థితి ఏర్పడింది. వెంకటగిరి నియోజకవర్గంలో కుండపోత వర్షం కురుస్తోంది. బాలాయపల్లి మండలంలో వరద ప్రవాహం కొనసాగుతోంది. కైవల్య నది కాజ్ వే పై వరద ఉద్ధృతి కొనసాగుతోంది. కడగుంట- నిండలి మార్గంలో మూడో రోజు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో వరద పరిస్థితులపై.. కలెక్టర్ ప్రతి రోజు సమీక్ష నిర్వహిస్తున్నారు.
ఉబికి వస్తున్న భూగర్భ జలాలు....
ఆత్మకూరు, మర్రిపాడు మండలాల్లో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో కొన్నిచోట్ల భూగర్భ జలాలు ఉబికివస్తున్నాయి. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద చేతి పంపు నుంచి నీరు పైకి వస్తోంది. చేతితో కొట్టకుండానే...స్థానికులు నీళ్లు పట్టుకెళ్తున్నారు. మర్రిపాడు మండలం.. పల్లవోలో గ్రామానికి చెందిన జయవర్ధన్ అనే రైతుకు చెందిన పొలంలో మోటర్ సహాయం లేకుండానే బోరుబావి నుండి నీరు వస్తోంది. 175 అడుగుల లోతు బోరు బావి నుంచి మోటార్ లేకుండానే నీరు పైకి వస్తోందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బోరు కింద మిర్చి సాగు చేస్తున్నారు.
సోమశిలకు కొనసాగుతున్న ప్రవాహం...
Somasila Project: నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం ఇన్ఫ్లో 96,569 క్యూసెక్కులు ఉండగా..ఔట్ ఫ్లో 1,15,396 క్యూసెక్కులుగా ఉంది. సోమశిల జలాశయం పూర్తి నీటి నిల్వ 77.98 టీఎంసీలు కాగా..ప్రస్తుత నీటి నిల్వ 68.37 టీఎంసీలుగా ఉంది.
40 మేకలు మృతి...
చేజర్ల మండలం, నాగుల వెల్లటూరు వద్ద వాగు ఉద్ధృతికి 40 మేకలు మృతి చెందాయి. మేకల మృతితో కాపరి రమణయ్య కన్నీటి పర్యంతమయ్యాడు.
ఇదీ చదవండి: DOLLAR SESHADRI FUNERALS: నేడు డాలర్ శేషాద్రి అంత్యక్రియలు.. హాజరుకానున్న సీజేఐ