నెల్లూరు జిల్లా..
నివర్ తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో రాత్రి నుంచే వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు కాలనీల్లో భారీగా వర్షపు నీరు చేరుతోంది. మాగుంట లేఔట్ ప్రాంతంలో వర్షానికి ఓ చెట్టు విరిగి కరెంటు తీగల మీద పడింది. తీగలు తెగి అక్కడ స్టిక్కరింగ్ పని పనిచేస్తున్న రజాక్‌పైన పడి అతను అక్కడికక్కడే మృతి చెందాడు. నాయుడుపేట, సూళ్లూరుపేట, కోవూరు, విడవలూరు ప్రాంతాల్లో వరి నాట్లు నీటమునిగాయి. సోమశిల జలాశయంలోకి ప్రవాహం వస్తుండగా కొంత నీటిని పెన్నానదిలోకి వదులుతున్నారు. 15 వేల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.
తుపాన్ ప్రభావంతో అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నెల్లూరు తహసీల్దార్ కార్యాలయంలో కాల్‌సెంటర్ ఏర్పాటు చేశారు. రాగల 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏదైనా సమాచారం కోసం కాల్ సెంటర్ నెంబర్ 897 876 2988 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. ఇప్పటికే ఎన్జీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నారని.. ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉన్నామని కలెక్టర్ తెలిపారు.
వెంకటగిరి నియోజకవర్గంలో రాత్రి నుంచి ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తునే ఉన్నాయి. కైవల్య నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దక్కిలి మండలం నడింపల్లి, బాలాయపల్లి మండలం నిండాలి దగ్గర కైవల్య నది కాజ్వేల పై ప్రవాహం ఉప్పొంగడంతో రాకపోకలకు ఆటంకం కలుగుతోంది.
ప్రకాశం జిల్లా..
నివర్ తుఫాన్ కారణంగా ప్రకాశం జిల్లాలనూ రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నారు. చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల్లో రాత్రి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. భారీగా ఈదురు గాలులు వీస్తున్నాయి. తహసీల్దార్ కార్యాలయాల్లో అధికారులు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. తీరప్రాంతాల్లో పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
కడప జిల్లా..
కడప జిల్లాలోనూ తుపాన్ ప్రభావం అధికంగానే ఉంది. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. భారీగా వర్షాలు కురవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్‌లోకి వర్షపు నీరు చేరడంతో.. ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు. అధికారుల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు, రెవెన్యూ, విద్యుత్‌శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు.
నివర్ తుఫాన్ వల్ల కడపలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తూనే ఉంది. రాత్రి నుంచి వర్షం కురిసినప్పటికీ ఉదయం నుంచి భారీగా వర్షం కురవడంతో వాహనదారులు పాదచారులు ఇబ్బందులు పడ్డారు. నగరంలోని అంబేద్కర్ కూడలి, ఆర్టిసి బస్ స్టాండ్ రోడ్డు, కోర్టు రోడ్డు, భాగ్యనగర్ కాలనీ, శాస్త్రి నగర్, అక్కయ్య పల్లి తదితర ప్రాంతాల్లో రోడ్లపై నీరు ప్రవహిస్తున్నాయి. అంతటి ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో తుఫాన్ పై సమీక్ష నిర్వహిస్తున్నారు.
చిత్తూరు జిల్లా..
తిరుమలలో నివర్ తుపాన్ ప్రభావానికి ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం మొదలైన వర్షం.. నిరంతరాయంగా కురుస్తూనే ఉంది. ఈదురుగాలులు వీయడంతో.. పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. దీంతో తిరుమలకు వస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. పాపవినాశనం రహదారిపై వృక్షం కూలడంతో అటవీ విభాగం సిబ్బంది వెంటనే దానిని తొలగించారు. బాలాజీ నగర్‌లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కనుమ దారుల్లో భక్తులు అప్రమత్తంగా ప్రయాణించాలని భద్రతా సిబ్బంది సూచనలు చేస్తున్నారు. తితిదే అటవీ విభాగం, ఇంజినీరింగ్, విజిలెన్స్ అధికారులు సమన్వయం చేసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
ఇదీ చదవండి: