నెల్లూరు జిల్లా కోవూరులో ఓ మహిళను హతమార్చేందుకు కానిస్టేబుల్ ప్రయత్నించాడు. చాకుతో విచక్షణారహితంగా దాడి చేయడంతో.. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. పట్టణంలోని లక్ష్మీనగర్ ప్రాంతంలో నివాసముంటున్న షేకున్ అనే మహిళపై.. వెంకటగిరి బెటాలియన్లో విధులు నిర్వర్తిస్తున్న సురేష్ అనే కానిస్టేబుల్ దాడికి పాల్పడ్డాడు.
రెండు నెలల క్రితం కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య చేసుకోవడంతో.. అందుకు షేకునే కారణమని భావించి ఈ దారుణానికి ఒడిగట్టాడని సీఐ రామకృషారెడ్డి పేర్కొన్నారు. ఇంట్లోకి ప్రవేశించి గొంతు, చేతులపై దాడి చేసినట్లు చెప్పారు. అడ్డుకోబోయిన షేకున్ భర్తపైనా విరుచుకుపడి.. అనంతరం పరారయ్యాడని వెల్లడించారు. గాయపడిన మహిళను స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఇదీ చదవండి: