నెల్లూరు జిల్లాలో కావలి నుంచి తడవరకు సముద్ర తీరం విస్తరించి ఉంది. సముద్ర స్నానాల కోసం 10 ప్రాంతాలకు పర్యాటకులు ఎక్కువగా వెళ్తుంటారు. ప్రభుత్వం అభివృద్ధి చేసిన బీచ్‌లు 5 ఉన్నాయి. వేసవి సెలవుల్లో సేద తీరేందుకు జనం ఈ బీచ్‌లకు వస్తున్నారు. తుమ్మలపెంట, కొత్తసత్రం, బంగారుపాలెం, తాటిచెట్లపాలెం, ఇసుకపల్లి, తూపిలిపాలెం, మైపాడు, కోడూరు, రామతీర్ధం, కాకేపల్లి, తడ తీరంలో జనసందోహం కనిపిస్తోంది. వచ్చిన వారంతా సమీపంలోని ఆలయాలు సందర్శించుకొని సముద్రంలో స్నానాలు చేస్తున్నారు.
పక్క రాష్ట్రాల నుంచీ పర్యాటకుల రాక
చిన్నారులు సముద్రంలో అలల మధ్య ఆటలాడుకుంటున్నారు. ఇసుకలో పరుగులు తీస్తూ సందడి చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి ఇక్కడకు వచ్చి సంతోషంగా గడుపుతున్నారు. యువత విహారాల్లో విషాదం చోటు చేసుకోకూడదని ప్రమాదకరంగా ఉన్న బీచ్‌ల్లో పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాలను అరికడుతున్నారు.