అమరావతి రైతుల మహాపాదయాత్ర రోజురోజుకూ ఉధృతంగా సాగుతోంది.. ఉప్పెనలా జ్వలిస్తోంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్ర.. బుధవారం 24వ రోజున సున్నపుబట్టి నుంచి మొదలై.. రాజుపాలెం వద్ద ముగిసింది. రాజుపాలెంలో అమరావతి రైతుల పాదాలకు స్థానిక అన్నదాతలు పాలాభిషేకం చేశారు. రైతుల పాదయాత్రలో మాజీ మంత్రి సోమిరెడ్డి పాల్గొన్నారు.
23వ రోజు బోగోలు మండలం కొండ బిట్రగుంట నుంచి దగదర్తి మండలం సున్నంబట్టి వరకు సుమారు 15కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. దారి వెంట స్థానికులు మంచినీరు, మజ్జిగ ఇస్తూ.. రైతులకు సంఘీభావం తెలిపారు. పోలీసులు డప్పు, ఇతర వాద్య కళాకారులను అడ్డుకోగా.. అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు సమయమనం పాటిస్తూ ముందుకు సాగారు. యాత్ర మొత్తం జాతీయ రహదారిపై సాగినప్పటికీ.. సమీప గ్రామాల ప్రజలు రోడ్డు వరకు వచ్చి సంఘీభావం తెలిపారు. జై అమరావతి అని నినాదాలు చేశారు. పలు చోట్ల విద్యార్థులూ యాత్రలో పాల్గొన్నారు.
కాగా.. మహాపాదయాత్రలో నడిచీ నడిచీ.. కాళ్లు బొబ్బలెక్కిన రైతుల పాదాలకు నెల్లూరు జిల్లా నరసరావుపేట తెదేపా ఇన్‌ఛార్జీ అరవిందబాబు పాలాభిషేకం చేశారు. అలాగే.. 3 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. బుధవారం కూడా సున్నపు బట్టీ నుంచి రాజుపాలెం వరకూ 15 కిలోమీటర్ల మేర నడక సాగింది. దారి పొడవునా లభిస్తున్న అపూర్వ ఆదరణతో.. ఉద్యమకారులు ఉత్సాహంగా నడక సాగిస్తున్నారు.
కడనూతల గ్రామంలో మహిళలు రైతులు, పిల్లలు, యువత పూలతో జై అమరావతి, జైజై అమరావతి(Amaravati farmers maha padayatra) అని రోడ్డుపై రాసి స్వాగతం పలికారు. కోవూరుపల్లి వాసులు ఘన స్వాగతం పలికారు. కప్పరాళ్లతిప్పలో మత్స్యకారులు రైతులకు సంఫీుభావంగా ఉలవపాళ్ల వరకూ.. పాదయాత్రలో పాలుపంచుకున్నారు. ఇస్కపాళెం నుంచి మత్స్యకారులు, మహిళలు వచ్చి సంఫీభావం తెలిపారు. కర్నూల్, నంద్యాల నుంచి సైతం వచ్చిన రైతులు అమరావతే అందరికీ అనువైన రాజధానిగా పేర్కొన్నారు.
కడపకు చెందిన ఓ వ్యాపారవేత్త.. కడనూతల వద్ద రైతులను కలిసి చలి నుంచి రక్షణకోసం 250 చలికోట్లు అందజేశారు. పేరు చెప్పేందుకు ఆయన నిరాకరించారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర దంపతులు.. రూ.3 లక్షల చెక్కు అమరావతి ఐకాస సభ్యులకు అందజేశారు. ప్రతి గ్రామంలోనూ ఆర్థిక స్తోమతను బట్టి సాయం చేస్తూనే ఉన్నారు. ఈ మహాపాదయాత్ర మెుత్తం 45 రోజుల పాటు కొనసాగనుంది. డిసెంబర్ 15న పాదయాత్ర తిరుమలకు చేరుకునేలా రైతులు ప్రణాళిక సిద్ధం చేశారు.
రేపు పాదయాత్రకు విరామం..
అమరావతి రైతుల పాదయాత్రకు రేపు విశ్రాంతి ఇస్తున్నట్లు అమరావతి ఐకాస కోకన్వీనర్ గద్దె తిరుపతిరావు ప్రకటించారు. రైతులు అలసిపోయి.. కాళ్లుకు బొబ్బలెక్కినందు వల్ల విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈనెల 26న రైతుల పాదయాత్ర నెల్లూరు చేరుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
MINISTER GOWTHAM REDDY: మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి నిరసన సెగ