YCP MLA Prasanna Kumar Reddy latest comments: నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)ని వీడుతున్నట్లు గతకొన్ని రోజులక్రితం సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొట్టిన విషయం విధితమే. ఆ వార్తలపై ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి స్పందించకపోవటంతో మరింతగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆ వార్తలపై ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మీడియా ముఖంగా స్పందించారు. విడవలూరు మండలం రామతీర్థంలో చేపట్టిన 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే.. తాను వైసీపీని వీడుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలన్నీ అవాస్తమని ఖండించారు.
ఈ సందర్భంగా రామతీర్థంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై దుష్ప్రచారం చేసేందుకే ప్రతిపక్షం ఈ వదంతులను సృష్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ''నేను వైసీపీని వీడుతున్నట్లు ఎవరైతే సోషల్ మీడియాలో ప్రచారం చేశారో వారిని ఒక్కటే అడుగుతున్నా.. ఒక వార్తను రాసేటప్పుడు, పోస్ట్ చేసేటప్పుడు నన్ను అడగాల్సిన బాధ్యత మీకు లేదా?, అనని మాటలను సృష్టించి వార్తలు రాయడమూ కరెక్టేనా..?, నాకు పార్టీలో గౌరవం లేదని రాశారు. జగన్ మోహన్ రెడ్డిగారూ నన్ను చాలా అప్యాయంగా, సొంత అన్నలాగా చూస్తాడు. నా కుమారుడు రజిత్ కుమార్ రెడ్డిని సొంత తమ్ముడిలాగా చూస్తాడు. జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డిగారు బ్రతికున్నప్పుడే ఆయన దగ్గరకు నేను వెళ్లాను. ఆరోజు నుంచి ఈరోజుదాకా జగన్ మోహన్ రెడ్డి నన్ను అప్యాయంగా పలకరిస్తూ, దగ్గరికి తీసుకుంటూ ఎవ్వరికి ఇవ్వని గౌరవాన్ని ఇస్తున్నారు. 2012లో బై ఎలక్షన్ జరిగింది. అందులో నేను భారీ మెజార్టీతో గెలిపొందాను. ఆ సమయంలో ఓ ప్రముఖ ఛానెల్ వన్ టూ వన్ కార్యక్రమం పేరుతో నన్ను ఇంటర్వూ చేస్తూ.. 'మీరు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీకిలోకి వచ్చారా కదా.. మళ్లీ భవిష్యత్తులో టీడీపీకి వెళ్తారా' అని అడిగారు. దానికి ఆరోజు ఇదే సమాధానం చెప్పా.. ఇప్పుడే అదే చెప్తున్నాను.. నా శరీరంలో ఉన్న చివరి రక్తపు బొట్టువరకూ జగన్ మోహన్ రెడ్డితోనే ఉంటాను.'' అని ఆయన అన్నారు.
అనంతరం సోషల్ మీడియాలో తనపై జరిగిన ప్రచారమంతా పూర్తిగా అవాస్తమన్నారు. తనపై దుష్ప్రచారం చేసేందుకే ప్రతిపక్షం ఈ వదంతులు సృష్టించిందని మండిపడ్డారు. తనను జగన్ ఎంతో గౌరవంగా చూస్తారని, నియోజకవర్గంలో అడిగిన సమస్యలన్ని పరిష్కరిస్తున్నారని వెల్లడించారు. నెల్లూరు బ్యారేజీకి తన తండ్రి పేరును పెట్టారని, తమ కుటుంబాన్ని ఎంతో గౌరవించే జగన్‌ను తాను ఎలా వీడుతానని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదంటూ తీవ్ర పదజాలంతో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి