నెల్లూరు జిల్లాలో నకిలీ పురుగు మందులు, నకిలీ ఎరువులు రాజ్యమేలుతున్నా.. వ్యవసాయ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు వ్యవసాయ కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పురుగుమందులు ఎమ్మార్పీ కన్నా తక్కువ ధరకు అమ్ముతున్నారని కొందరు రైతులు అనుమానం వ్యక్తం చేశారు. ఎమ్మార్పీ కన్నా పురుగుమందులు ఎందుకు తగ్గించి రైతులకు అమ్ముతున్నారో చెప్పాలన్నారు.
ప్రతి సీజన్లో రైతులు ధాన్యం అమ్ముకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని.. మిల్లర్లు అడిగిన రేటుకే ధాన్యం అమ్ముకోవాల్సి వస్తుందని పలువురు వ్యవసాయ కమిటీ సభ్యులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. అలా కాకుండా రైతులకు ధాన్యం ఆరబెట్టుకునే యంత్రాలు ఏర్పాటు చేస్తే.. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవచ్చు అని తెలిపారు. వ్యవసాయ అధికారులు చేస్తున్న ఈ కర్షక్ కూడా.. సరిగ్గా చేయడం లేదని దానిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలని కోరారు.
జిల్లాలో గోదాముల కొరత తీవ్రంగా ఉందని డీసీసీబీ ఛైర్మన్ ఆనం వినయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం గోదాములు నిర్మించామని చెబుతున్నప్పటికీ, స్థలాలు లేకపోవడంతో ఎవరూ ముందుకు రావడంలేదన్నారు. గోదాములు నిర్మించేందుకు ఎవరైనా ముందుకు వస్తే వారికి రుణం ఇచ్చేందుకు కోపరేటివ్ బ్యాంక్ సిద్ధంగా ఉందన్నారు.
ఇదీ చదవండి: ఫైజర్ 'కరోనా వ్యాక్సిన్' 90శాతం ప్రభావవంతం!