నేను బతికే ఉన్నాను.. అది ఎలా నిరూపించుకోవాలో అర్థం కావడం లేదంటూ.. ఓ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పెగళ్లపాడు అనే గ్రామానికి చెందిన దస్తగిరి సాహెబ్‌కు షేక్ కమాల్ సాహెబ్, షేక్ హుస్సేన్ సాహెబ్ అనే ఇద్దరు కుమారులు. తండ్రి దస్తగిరి పేరిట ఒక ఎకరా పొలం ఉంది. ప్రభుత్వ రికార్డుల్లో తండ్రి దస్తగిరి పేరు మీద ఉన్న ఎకరా పొలాన్ని ఇద్దరు అన్నదమ్ములు సాగు చేసుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులతో కమాల్ సాహెబ్ కుటుంబం వలస వెళ్లింది. అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి పొలం సాగు చేసుకునేవాడు. అయితే తండ్రి పేరున ఉన్న పొలాన్ని అన్నదమ్ములిద్దరి పేరిట మార్చమని మర్రిపాడు రెవెన్యూ అధికారులను కమాల్ సాహెబ్ కోరారు. రెండేళ్లుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ఫలితం లేదు. ఈ క్రమంలో జనవరి నేలలో తమ్ముడు హుస్సేన్ సాహెబ్.. స్థానిక వీఆర్వో సహాయంతో అన్న కమాల్ సాహెబ్ చనిపోయినట్టుగా రికార్డు తయారు చేసి మొత్తం పొలాన్ని తమ పేరిట నమోదు చేయించుకున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న కమాల్ సాహెబ్... తహసీల్దార్ కార్యాలయంలో ఆడిగాడు. అప్పటి నుంచి ప్రతీ రోజు కార్యాలయం వద్దకు వచ్చి తన గోడు చెప్పుకుంటున్నాడు.. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. అయ్యా నేను బతికే ఉన్నాను మహాప్రభో.. సగం పొలం నా పేరిట నమోదు చేయండి అని మోరపెట్టుకుంటున్నాడు. అధికారులు మాత్రం నువ్వు చనిపోయావని రికార్డులో ఉందని చెబుతున్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక తాను బతికే ఉన్నట్లు రుజువు చేసుకోవడానికి కమాల్ సాహెబ్.. రోజు ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. కార్యాలయం వద్దకు రావడం. చెట్టు కింద కూర్చోని వెంట తెచ్చుకున్న బిస్కెట్లు తిని ఆఫీసులో ఒకసారి కనిపించి మధ్యాహ్నం ఇంటికి పోవడం. ఇదే ఆ రైతు దినచర్యగా మారింది. నేను బతికే ఉన్నాను అని బాధితుడు మోరపెట్టుకుంటున్నా.. అధికారుల్లో మాత్రం చలనం లేదని ఆ రైతు కంటతడి పెట్టాడు. అధికారుల చేతివాటం ఓ వ్యక్తి జీవన పోరాటంగా మారిన ఈ సంఘటన రెవెన్యూ అధికారుల తీరుకు నిదర్శనంగా నిలిచింది.
ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నేను వలస వెళ్లాను. మా తండ్రి పేరు మీద ఉన్న మొత్తం పోలాన్ని మా తమ్ముడు హుస్సేన్ సాహెబ్ పేరు మీద అధికారులు నమోదు చేశారు. అదేమని అడిగితే నువ్వు చనిపోయావు అంటున్నారు. నేను బతికే ఉన్నాను.. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన పొలంలో సగం వాట తనకు చెందేలా నమోదు చేయమని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా.. అధికారులు పట్టించుకోవట్లేదు. నేను చనిపోయి ఉంటే రోజు ఇక్కడికి (తహసిల్దార్ ఆఫీసుకు) ఎలా వస్తున్నాను అని వాపోయాడు. - కమాల్ సాహెబ్, బాధితుడు
ఇదీ చదండి..