ఈ పెద్దాయన.. పేరుకే తాత. ఉత్సాహంలో, ఆరోగ్యంలో మాత్రం.. ఇప్పటికీ యూత్ అన్నట్టే ఉంటారు. పిల్లలు, మనుమలతో గడపాల్సిన వయసులోనూ... మైదానంలో పరుగులు తీస్తున్నారు. ఇలా.. ఫిట్నెస్ను కాపాడుకుంటూ.. పేరుకు తగ్గట్టే ఆనందంగా జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు... ఆనందరావు. నెల్లూరు జిల్లా సంగం మండలం ముక్తాపురానికి చెందిన ఆయనకు.. చిన్నతనం నుంచే క్రీడలపై ఆసక్తి. వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేసి వేలాది మందిని జాతీయస్థాయి క్రీడాకారులుగా తయారు చేశారు. పదవీవిరమణ చేసినా...ఇప్పటికీ తెల్లవారుజామునే మైదానానికి వెళ్లి.. యువకులతో కలిసి పరుగులు తీస్తుంటారు.
ఈ తాత ప్రతిరోజు ఐదు కిలోమీటర్లు సైకిల్ తొక్కుతారు. మరో రెండు కిలోమీటర్లు నడుస్తారు. అనంతరం జంపింగ్ చేస్తారు. ఇంత హుషారుగా ఉండే ఆనందరావు చూసి.. మైదానంలోని అందరూ ఆశ్చర్యపోతుంటారు. అలా చూసే వారిని పిలిచి మరీ... వ్యాయామం చేయిస్తుంటారు ఆనందరావు. ఈ వయస్సులోనూ ఇంత హుషారుగా ఉండాటానికి వ్యాయామమే కారణమంటారాయన. పదవీ విరమణ తర్వాత రాష్ట్ర, జాతీయ స్థాయిలో వృద్ధులకు నిర్వహించిన అనేక క్రీడా పోటీల్లో ఆనందరావు ప్రతిభ కనబర్చారు. పోల్ వాల్ట్, ట్రిపుల్ జంప్, లాంగ్ జంప్‌లో సత్తా చాటారు. ఎందరికో రోల్ మోడల్ గా నిలిచారు. కొవిడ్ వంటి మహమ్మారిని ఎదుర్కోవడంలోనూ వ్యాయామం కీలకపాత్ర పోషిస్తుందని ఆనందరావు చెప్పారు. వ్యాయమంతో.. ఆనందంగా ఉండండి.. ఆరోగ్యంగా ఉండండి.. అని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: