People are suffering due to stoppage of bridge works: అది పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలో సువర్ణముఖి నదిపై ఉన్న వంతెన. జిల్లాలోని వివిధ మండలాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వెళ్లే వారు ఆ మార్గం గుండా రాకపోకలు సాగిస్తుంటారు. అంతర్ రాష్ట్ర రహదారిపై.. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో వంతెన నిర్మించారు. ఇది పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఈ నేపథ్యంలో.. కొత్త వంతెన నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు గాను నిధులు కేటాయించి పనులు ప్రారంభించింది.
ఇంతలో ప్రభుత్వం మారింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 30 నెలలపాటు.. ఆ పనులు పట్టించుకోలేదు. చివరకు 2021 మార్చిలో పనులు తిరిగి ప్రారంభించారు. సాగినట్లే సాగిన పనులు.. ఇప్పుడు ఆగిపోయాయి. సంబంధిత గుత్తేదారుకు బిల్లులు చెల్లించకపోవడంతో అర్థాంతరంగా నిలిచిపోయాయి.
ప్రస్తుతం పాత వంతెనకు తాత్కాలికంగా మరమ్మతులు చేసి రాకపోకలు సాగించేలా.. అధికారులు ఏర్పాట్లు చేశారు. కానీ ఆ వంతెన పరిస్థితీ దినదిన గండగా ఉంది. అంతర్‌రాష్ట్ర రహదారి కావడంతో వంతెన పై నుంచి ఒడిశా, చత్తీస్‌గఢ్ వైపు భారీ వాహనాలు వెళ్తున్నాయి. దీని వల్ల ఎప్పుడు బ్రిడ్జ్ కూలుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కొత్త వంతెనను పూర్తి చేస్తే.. కష్టాలు తొలగుతాయని చెబుతున్నారు.
సీతానగరం వంతెనపై వాహనాల రద్దీతో తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొండి గోడలు, పిల్లర్ల వద్దే నిలిచిపోయిన కొత్త వంతెన నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని తెలుగుదేశం నేతలు డిమాండ్ చేస్తున్నారు. వంతెన పనులకు సంబంధించిన గుత్తేదారుకు 3 కోట్ల రూపాయల మేర బిల్లులు పెండింగ్ ఉన్నట్లు.. రోడ్లు, భవనాల శాఖ డీఈ అప్పాజీ తెలిపారు. సమస్యను త్వరలో పరిష్కరిస్తామని వెల్లడించారు.
"ఇక్కడ నిత్యం వేలాది మంది ప్రయాణిస్తున్నారు. వాహనాలు భారీగా వెళ్తాయి.. కానీ ఈ బ్రిడ్జ్‌ని పూర్తి చేయలేదు. కాబట్టి దీనిని వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం". - స్థానికుడు
"పాత బ్రిడ్జ్ మీద వెళ్లడం వలన అది పెచ్చులు ఊడిపోతే.. రెండు సార్లు సుమారు రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ నిధులను తినేశారు. కానీ బ్రిడ్జ్ మాత్రం బాగుపడలేదు. పోనీ కొత్త బ్రిడ్జ్ అయినా వస్తుందనుకుంటే అది కూడా లేదు. ఈ బ్రిడ్జ్‌ని తక్షణమే ప్రభుత్వం పూర్తి చేయాలి". - స్థానికుడు
"ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రజలు చనిపోతున్నారు. ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ప్రజాపతినిధులు దృష్టి పెట్టడం లేదు. పెరుగుతున్న జనాభా.. అదే విధంగా పెరుగుతున్న ట్రాఫిక్ వీటి అన్నింటి గురించి ప్లాన్ చేయాలి. ప్రభుత్వం భవిష్యత్ గురించి ఆలోచించడం లేదు. ఇది చాలా తీవ్రమైన సమస్య". - ద్వారపురెడ్డి జగదీష్, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ
ఇవీ చదవండి: