NRI Mohan Sudhir Patta adopted Addapushila village: తెలుగు చిత్రసీమలో ఘన విజయం సాధించిన 'శ్రీమంతుడు' సినిమా చూడని తెలుగు వారుండరంటే అతిశయోక్తి కాదు. ఆ సినిమాలో హీరో మహేశ్ బాబుకి తన సొంత ఊరి గురించి, ఆ ఊరిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి హీరోయిన్ (శృతిహాసన్) అతనికి చెప్తుంది. దాంతో హీరో మహేశ్ బాబు.. ప్రాజెక్ట్ పేరుతో అక్కడికి వెళ్లి.. ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటారు. ఆ తర్వాత గ్రామంలో ఉన్న ఒక్కొక్క సమస్యను తీర్చుతూ.. గ్రామ ప్రజల్లో మంచి కీర్తిని గడిస్తారు. సరిగ్గా అలాంటి విధానాన్నే కొనసాగిస్తున్నారు కొందరు ఎన్నారైలు. కష్టాల్లో ఉన్న ప్రజలకు ఎదైనా మంచి పని చేయాలన్న సంకల్పంతో.. వెనకబడిన గ్రామాలను దత్తత తీసుకుని శ్రీమంతులుగా పేరు గడిస్తున్నారు. తాజాగా మోహన్ సుధీర్ పట్టా అనే ఎన్నారై.. పార్వతీపురం మన్యం జిల్లా అడ్డాపుశీల గ్రామాన్ని దత్తత తీసుకుని శ్రీమంతుని పేరు సార్థకత చేసుకుంటున్నారు.
ప్రజలకు అండగా నిలుస్తున్న ఎన్నారై.. మంచి పని చేయాలన్న సంకల్పానికి దూరంతో పనిలేదు. తనకు సంబంధంలేని ఓ గ్రామాన్ని దత్తత తీసుకోని అభివృద్ధి పనులు చేస్తున్నాడు ఓ ఎన్నారై. ఆ ప్రాంతంతో అతనికి ఎటువంటి సంబంధం లేనప్పటికీ.. ప్రజల అవసరాలు తెలుసుకుని మరీ.. వారికి అండగా నిలుస్తున్నాడు. గ్రామంలో ఆ ఎన్నారై చేస్తున్న పనులతో శ్రీమంతుని పేరు సార్థకత చేసుకుంటున్నారు. మరి ఆ ఎన్నారై చేపట్టిన అభివృద్ధి ఏంటి..?, ఆయన ఏ జిల్లాకి చెందిన వారు..?, ఏయే కార్యక్రమాలు చేపట్టారు..? అనే వివరాలను తెలుసుకుందామా..!
అడ్డాపుశీల గ్రామాన్ని దత్తత తీసుకున్న ఎన్నారై.. పార్వతీపురం మన్యం జిల్లా అడ్డాపుశీల గ్రామం ఆధ్యాత్మికం పరంగా మంచి గుర్తింపు సాధించింది. కానీ, గ్రామంలో మౌలిక సదుపాయాల కొరత ఉండటం ఎన్నారై మోహన్ సుధీర్ పట్టా దృష్టికి వచ్చింది. దీంతో ఆయన ఆ గ్రామాన్ని దత్తత తీసుకొని.. కొన్ని నెలలుగా అనేక మౌలిక సదుపాయాలు కల్పిస్తూ వస్తున్నారు. తనకు తోచిన విధంగా ఆ గ్రామ అభివృద్ధికి పనులు చేపట్టారు. దీంతో ఆ గ్రామ ప్రజల్లో ఆయన శ్రీమంతునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం.. ఎన్నారై మోహన్ సుధీర్ పట్టా.. ఏలూరు ప్రాంతానికి చెందినవారు. ఆయన ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం వెనుకబడిన జిల్లాల్లో ఉన్న ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలన్న ఆయన ఆలోచనకు ఉమ్మడి విజయనగరం జిల్లా అధికార యంత్రాంగం అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన పార్వతీపురం మన్యం జిల్లా అడ్డాపుశీల గ్రామాన్ని దత్తత తీసుకుని.. గ్రామంలో తొలుత పాఠశాల, అంగన్వాడీలను అభివృద్ధి పరిచారు. ఆ తర్వాత మినరల్ వాటర్ ప్లాంట్, గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు.
కరోనా సమయంలో క్యాంపులు.. కరోనా సమయంలో ఉచిత మెడికల్ క్యాంపులు.. మహిళలు స్వశక్తితో జీవించేందుకు దోహదపడే ఉచిత టైలరింగ్ శిక్షణకు శ్రీకారం చుట్టారు. గ్రామ శివారులో వెలసిన కాశీ విశ్వేశ్వర ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. అక్కడ గిరి ప్రదక్షిణ చేసే సమయంలో భక్తులకు దాహార్తిని తీర్చేందుకు రక్షిత నీటి సౌకర్యం కల్పించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అధునాతన వైద్య పరికరాలను అందజేశారు.
గ్రామంలో అడుగు పెట్టని ఎన్నారై.. కొన్నేళ్లుగా అభివృద్ధి పనులు చేస్తున్న సుధీర్ పట్టా.. ఇంతవరకు ఆ గ్రామంలో అడుగు పెట్టలేదు. గ్రామానికి చెందిన అక్కిన సుందర నాయుడు పర్యవేక్షణలో ఈ పనులన్నీ చేపడుతూ.. ఎప్పటికప్పుడు వాటి ఫలితాలను ఆన్లైన్లో తెలుసుకుంటున్నారు. గ్రామానికి ఏమి కావాలన్నా తాను సిద్ధమేనని సుధీర్ పట్టా భరోసా ఇచ్చారని గ్రామస్తులు చెబుతున్నారు. ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్న ఆయనను.. ఇంతవరకు ప్రత్యేకించి, చూడనప్పటికీ ఆయన ఫోటో చూసి ఈయన మా ఊరి శ్రీమంతుడని గ్రామస్థులు కొనియాడుతున్నారు.