Four elephants died in Parvathipuram Manyam district: పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గత ఆరు నెలలుగా రెండు గుంపులుగా తిరిగిన ఆరు ఏనుగుల్లో నాలుగు ఏనుగులు విద్యుదాఘాతానికి బలైపోయాయి. మరో రెండు ఏనుగులు తప్పించుకుని అడవుల వైపు వెళ్లిపోయాయి. అడవిలో ఉండాల్సిన గజరాజులు జనవాసాల్లోకి వచ్చి మృత్యవాతకు గురి కావడం ఆ ప్రాంత ప్రజలను కన్నీరు పెట్టించింది. ఆహరం, దాహం కోసం పంట పొలాల్లో సంచరిస్తున్న సమయంలో ప్రమాదవశావత్తూ విద్యుదాఘాతానికి గురై, ఒక మగ ఏనుగు, మూడు ఆడ ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందడం కలవరానికి గురిచేసింది. అయితే, తప్పించుకునిపోయిన ఆ రెండు ఏనుగులు తిరిగొచ్చి ఎలాంటి బీభత్సాన్ని సృష్టిస్తాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్న్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి కాపాడాలంటూ వేడుకుంటున్నారు.
కాట్రగడ-Bలో నాలుగు ఏనుగులు మృతి.. ఈ విషాద ఘటన పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం కాట్రగడ-B వద్ద జరిగింది. ఆరు ఏనుగుల్లో నాలుగు చనిపోవడంతో మిగిలిన రెండు భయంతో ఏం చేస్తాయోనని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒడిశా నుంచి వచ్చిన ఆరు ఏనుగుల గుంపు.. గత కొంత కాలంగా పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం కాట్రగడ-Bలో సంచరిస్తున్నాయి.
ఆరు ఏనుగుల్లో రెండు సురక్షితం.. ఈ క్రమంలో ఆహార వేటలో భాగంగా పొలాల్లో సంచరిస్తున్న సమయంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ని తాకడంతో.. నాలుగు ఏనుగులు అక్కడికక్కడే మరణించాయి. ముందుగా పిల్ల ఏనుగు ట్రన్స్‌ఫార్మర్‌ని తాకడంతో.. అది విద్యుత్ షాక్ గురైంది. దాన్ని రక్షించే క్రమంలో మిగతా మూడు కూడా ఒకదాని వెనక ఒకటి ప్రమాదానికి గురై, మృతిచెందాయని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు, జంతు వైద్యులు అక్కడికి చేరుకుని పరిస్థితిని గమనించారు. అనంతరం పొలం యజమాని అనుమతితో మృతి చెందిన ప్రాంతంలోని ఏనుగుల మృత దేహాలను ఖననం చేశారు. ఆరు ఏనుగుల్లో రెండు సురక్షితంగా బయటపడి.. సమీపంలోని తువ్వకొండ వైపు వెళ్లాయని స్థానికులు తెలిపారు.
ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదమే.. కొన్నాళ్లుగా భామిని మండలంలో తిష్ట వేసిన ఏనుగులను తరలించేందుకు అటవీశాఖ అధికారులు విశ్వప్రయాత్నాలు చేస్తున్నా.. అవేవి ఫలించలేదు. అయితే, వాటి వల్ల ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని స్థానికులు చెబుతున్నారు. ఒక్కసారిగా నాలుగు గజరాజులు మృత్యవాతకు గురికావడం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదమే తప్ప.. ఇందులో విద్యుత్ అధికారుల పొరపాటేమీ లేదని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.
అధికారులు స్థానికులను కాపాడండి.. ఇదిలా ఉండగా.. గుంపుగా తిరిగే వాటిలో నాలుగు మృతి చెందితే.. మిగిలిన రెండు గజరాజులు విచక్షణ కోల్పోయి ఎలాంటి బీభత్సం సృష్టిస్తాయోనని స్థానికులు భయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు అప్రమత్తమై ఆ రెండు ఏనుగులు బీభత్సం సృష్టించకముందే భామిని మండలం కాట్రగడ-Bతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను కాపాడాలని స్థానికులు అధికారులను వేడుకుంటున్నారు.
ఇవీ చదవండి