Elephants attack On Old Man: పార్వతీపురం మన్యం జిల్లాలోని ప్రజలు ఏనుగుల భయంతో బెంబేలెత్తిపోతున్నారు. ఒక ఏనుగు కాదు రెండు ఏనుగులు కాదు ఏకంగా ఏనుగుల గుంపుల సంచారంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. దీంతో వీటి నుంచి ప్రజలను కాపాడటానికి ట్రాకర్ల బృందం బరిలోకి దిగుతోంది. తాజాగా సోమవారం ఏనుగుల గుంపు జనవాసంలోకి రాగా.. వాటిని తరిమికొట్టేందుకు ట్రాకర్ల బృందం సిద్ధమైంది. ఈ క్రమంలో ఏనుగులు వారి పైకి దూసుకురావటంతో.. వాటి దాడికి ఓ ట్రాకర్ ప్రాణాలు కోల్పోయారు.
ఇందులో భాగంగా గత నాలుగేళ్ళలో ఇప్పటి వరకు 10 మంది మృత్యువాత పడ్డారు. 12మంది వరకు గాయపడ్డారు. అటవీశాఖకు చెందిన ఇద్దరు ట్రాకర్లు ఏనుగుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. 6,700మంది రైతులు.. 5,257 ఎకరాల్లో పంటను నష్టపోయారు.
ఈ రోజు వేకువజామున బలిజపేట మండలం చెల్లంపేటకు చెందిన దేశీనాయుడు (60) అనే వృద్ధుడు ఏనుగుల దాడికి గురయ్యాడు. బహిర్భూమికి వెళ్తున్న అతనిపై గుంపులో ఒక ఏనుగు దాడి చేయడంతో.. దేశీనాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బలిజపేట మండలం చెల్లపేట - మిర్తివలస గ్రామాల మధ్య ప్రస్తుతం ఏడు ఏనుగులు సంచరిస్తున్నాయి.
నాలుగేళ్ల నుంచి జిల్లాలో ఏనుగులు గుంపులు ఏటా దాడి చేస్తున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదంటూ మన్యం జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారపార్టీ నేతలు, అధికారులు స్పందించి... ఏనుగుల తరలింపుకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వాసులు అధికారులను కోరుతున్నారు.
ఇవీ చదవండి: