SC COLONY RESIDENTS PROTEST : పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రు వద్ద ఎస్సీ కాలనీ వాసులు నిరసనలు చేపట్టారు. తమ శశ్మాన వాటిక మీదగా జగనన్న లే అవుట్లకు రాత్రికి రాత్రే అక్రమంగా రహదారి నిర్మించారని ఆందోళన వ్యక్తం చేస్తూ ధర్నా చేపట్టారు. గతంలో ప్రభుత్వం తమ పూర్వీకులకు 362 సర్వే నెంబర్లో ఎకరా డెబ్బై సెంట్ల భూమిని శ్మశాన వాటికకు కేటాయించినట్లు తెలిపారు.
"ఓట్లు వేయించుకున్న తర్వాత ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు దళితులు అంటే చులకనగా ఉంటుంది. ఈ శ్మశాన వాటికలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టొద్దని అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన వారి నుంచి స్పందన రాలేదు. మా శ్మశాన వాటికలను సర్వే చేసి మా వాటిని మాకు అప్పగించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం"స్థానికులు, పసుమర్రు ఎస్సీ కాలనీ వాసులు
అందులో నుంచి గతంలో కూడా రోడ్లు వేయాలని పట్టుపడితే ఒప్పుకోలేదని.. ప్రస్తుతం శ్మశాన వాటిక పక్కనే ఉన్న జగనన్న లే అవుట్లలో కాలనీలు ఏర్పాటు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వందల ఎకరాలు కొని లే అవుట్లు వేసిన అధికారులు.. రహదారి కోసం మరో ఎకరా కొనుగోలు చేస్తే దారి ఏర్పాటు అయ్యేదన్నారు.
"రాత్రికి రాత్రే శ్మశానాలు ఆక్రమణకు గురవుతున్నాయి. జగనన్న లే అవుట్ల కోసం ఎకరాలు కొంటున్న ప్రభుత్వం.. రోడ్ల కోసం మరో ఎకరం కొనుగోలు చేయవచ్చు కదా. మా దళితుల భూములను ఆక్రమించుకోవడం దేనికి. మా దళితుల సమస్యలపై అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా వాటిని స్వీకరించలేదు. ఇప్పటికైనా మా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాం"- స్థానికులు, పసుమర్రు ఎస్సీ కాలనీ వాసులు
అలా కాకుండా తమ శ్మశాన వాటిక మీదుగా రాత్రికి రాత్రి రోడ్లు వేయటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళితులమనే ఇలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేసిన రహదారులను ప్రోక్లైన్ ద్వారా పక్కకు తొలగించి.. నాలుగు వైపులా కందకాలను కూడా కాలనీ వాసులు తీయించారు. తమ స్మశాన వాటికలో రహదారులు వేయటానికి ఒప్పుకోమని తేల్చిచెప్పారు.
"జగనన్న కాలనీ లే అవుట్లు వేశారు. ఆ లే అవుట్లలో రోడ్ల కోసం శ్మశానం మధ్య లోంచి రోడ్లు వేస్తున్నారు. గతంలో రెండు సార్లు కూడా రోడ్లు వేస్తుంటే అడ్డుకున్నాం. అప్పుడు సుమమారు రెండు నెలల వరకూ మళ్లీ ఏం పనులు చేయలేదు. కానీ గత రాత్రి మళ్లీ రోడ్ల కోసం పనులు మొదలుపెట్టారు"-స్థానికులు, పసుమర్రు ఎస్సీ కాలనీ వాసులు
ఇవీ చదవండి: