Illegal Quartz Mining in Palnadu District: పల్నాడు జిల్లాలో అత్యంత అరాచకశక్తిగా పేరొందిన అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి తన ప్రాంతంలోని సమస్త ప్రకృతి సంపద అంతా తన సొంతమనే భావిస్తున్నారు. అత్యంత విలువైన ఖనిజాన్ని ఇష్టారాజ్యంగా తవ్వేసుకుని అమ్మేసుకోవడం తన హక్కే అనుకుంటున్నారు. ఆ దోపిడీ పరంపరలో భాగంగా తన బినామీల్ని ముందుపెట్టి... 50 కోట్లకు రూపాయలకుపైగా విలువైన క్వార్ట్జ్ ఖనిజాన్ని స్వాహా చేసేశారు. అది కూడా దేవుడి మాన్యంలో..! లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సమీపంలోనే యథేచ్ఛగా తవ్వేశారు. ప్రభుత్వానికి ఒక్క రూపాయి రాయల్టీ చెల్లించకుండా సుమారు 50 వేల టన్నులకు పైగా ఖనిజాన్ని గుట్టుచప్పుడు కాకుండా తవ్వేసి.., శుద్ధిచేసి మరీ విదేశాలకు తరలించేశారు. KGF సినిమాను తలపించే ఈ దోపిడీ ఫలితంగా ఇప్పుడక్కడ కరిగిపోయిన, గోతులు పడిన కొండ, శకలాలు మిగిలాయి. అక్కడ 50 వేల టన్నుల కంటే ఎక్కువ పరిమాణంలో దోపిడీ జరిగిందని.., CBI వంటి కేంద్ర సంస్థలతో దర్యాప్తు జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఒంగోలులో కొనసాగుతున్న భూకబ్జాలు - నకిలీ స్టాంపులు, అక్రమ రిజిస్ట్రేషన్లతో మోసాలు
Palnadu district YCP leaders Irregularities : క్వార్ట్జ్ ఎంతో విలువైన ఖనిజం. గాజు పరిశ్రమ, గృహాలంకరణ సామగ్రి తయారీలో వినియోగిస్తారు. పల్నాడు జిల్లా కారంపూడి మండలం పేటసన్నెగండ్ల గ్రామ పరిధిలోని కొండల్లో ఈ ఖనిజం నిల్వలు విస్తారంగా ఉన్నాయి. అక్కడ సింగరుట్ల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కాకతీయ రాజులు 3 వేల 938.04 ఎకరాల భూముల్ని మాన్యంగా ఇచ్చారు. ఆ భూముల్లోని కొండల్లో క్వార్ట్జ్‌తతో పాటు వివిధ రకాల ఖనిజాలున్నాయి. ఆలయానికి కిలోమీటర్ దూరంలో క్వార్ట్జ్ నిల్వలు విస్తారంగా ఉన్న కొండపై పల్నాడుకు చెందిన ఆ కీలక ప్రజాప్రతినిధి కన్ను పడింది. అధికారం అండతో చెలరేగిపోయారు. ఆయన కనుసన్నల్లో ఏడాదికిపైగా ఖనిజం ఉన్నంత మేర ఇష్టానుసారం తవ్వేశారు. ఆ కొండను చిన్న గుట్టలా మార్చేశారు. పనికిరావనుకున్న రాళ్లు, మట్టి వదిలేశారు. ఆ ప్రజాప్రతినిధి కానీ, ఆయన మనుషులు కానీ ఖనిజం తవ్వేందుకు అనుమతులు తీసుకోవడం, ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించడం వంటివేమీ లేకుండా.. 50 కోట్ల రూపాయలకుపైగా విలువైన ప్రకృతి సంపదను యథేచ్ఛగా దోచేశారు.
బడా కంపెనీకి అనుకూలంగా బీచ్ శాండ్ టెండర్ నిబంధనలు- దరఖాస్తు ధరే రూ.5 లక్షలు!
YCP Leaders illegally transporting White stone: లక్ష్మీ నరసింహస్వామి ఆలయ భూముల్లోని 25 ఎకరాల్లో క్వార్ట్జ్ నిల్వలున్నాయి. వాటిని దేవాదాయశాఖ రెండు ప్లాట్లుగా విభజించి 2021 మార్చిలో వేలం నిర్వహించింది. ఆ ప్రజాప్రతినిధికి అత్యంత సన్నిహితులైన ఇద్దరు సోదరులు.. ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకుని వాటిని వేలంలో దక్కించుకున్నారు. అన్న పన్నెండున్నర ఎకరాల్ని ఏడాదికి లక్షా 7 వేల 500 చెల్లించేలా, తమ్ముడు పన్నెండున్నర ఎకరాల్ని ఏడాదికి లక్షా 10 వేల రూపాయలు లీజు కట్టేలా తీసుకున్నారు. ఆ సోదరులిద్దరిలో అన్న... ప్రజాప్రతినిధి ఇంట్లో సొంత మనిషిలా ఉంటూ.., ఆయన వ్యవహారాలన్నీ చక్కబెడుతుంటారు. ఆ సోదరుల తల్లి అధికార పార్టీకి చెందిన మండలస్థాయి ప్రజాప్రతినిధిగా ఉన్నారు. వారికి స్వయంగా ఖనిజాన్ని తవ్వి ఎగుమతి చేసే స్థాయి, స్థోమత లేవు. వారి పేరుతో ఆ ప్రజాప్రతినిధే మొత్తం దోపిడీ చేసి, తన పేరు ఎక్కడా బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు.
White stone illegal mining: దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం ఆ సోదరులిద్దరికీ 2021 మార్చి 17 నుంచి 2024 మార్చి 16 వరకు లీజు గడువు ఉంది. తొలి ఏడాది లీజు మొత్తాన్ని చెల్లించిన వారిద్దరూ..., రెండో ఏడాది చెల్లించలేదని సమాచారం. వేలంలో క్వారీని దక్కించుకున్నవారు అక్కడ తవ్వకాలు జరిపేందుకు గనులశాఖ నుంచి అనుమతులు తీసుకోవాలని..., ప్రభుత్వానికి పన్నులు, సెస్‌లు వారే చెల్లించాలని నిబంధనలున్నప్పటికీ.. ఎలాంటి అనుమతులు లేకుండా, ప్రభుత్వానికి ఒక్క రూపాయి కట్టకుండా ఖనిజాన్ని దోచేశారు. పేటసన్నెగండ్ల సమీపంలోని కొండలో తవ్వకాలు జరిపి ముడి ఖనిజాన్ని దిగువ ప్రాంతానికి తరలించారు.
illegal quartz mining: అక్కడే శుద్ధి చేసి వాహనాల ద్వారా రవాణా చేశారు. భారీ వాహనాల రాకపోకలకు వీలుగా జేసీబీల్ని ఉపయోగించి దారి కూడా వేసుకున్నారు. ఇక్కడి నుంచి పేటసన్నెగండ్ల గ్రామం మీదుగా కాకుండా అటవీప్రాంతం ద్వారా ప్రధాన రహదారిలోకి వాహనాలు వెళ్లేలా మార్గాన్ని ఎంచుకున్నారు. దాంతో అక్కడి నుంచి కోట్ల రూపాయల విలువైన ఖనిజం తరలిపోతోందన్న విషయం స్థానికులకు కూడా తెలియడంలేదు. ప్రస్తుతం అక్కడ సుమారు అయిదెకరాల విస్తీర్ణంలో తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఎగుమతికి సరిపడా ఖనిజాన్ని తరలించి వృథాను అక్కడే వదిలేశారు. అక్కడ సెమీగ్లాస్ రకానికి చెందిన క్వార్ట్జ్ లభిస్తోంది. ఇది మార్కెట్లో టన్ను 10 వేల వరకు ధర పలుకుతోంది. ఇటీవల దీనికి బాగా డిమాండ్ పెరిగింది. ఇక్కడ తవ్విన విస్తీర్ణాన్ని బట్టి 50 వేల టన్నులకు పైగా తరలించినట్లు అంచనా. టన్ను 10 వేల రూపాయల చొప్పున వేసుకున్నా... 50 కోట్లకు పైగా విలువైన ఖనిజ సంపదను కొల్లగొట్టినట్టు ప్రాథమిక అంచనా. అక్కడ అంత జరుగుతున్నా.. గనులశాఖ అధికారులు కనీసం అటువైపు తొంగి చూడకపోవడం విస్తుగొలుపుతోంది.