TDP Chalo Macherla programme: మాచర్లలో వైకాపా విధ్వంసకాండను నిరసిస్తూ తెలుగుదేశం చేపట్టిన చలో పల్నాడు....తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తెదేపా ముఖ్య నేతల్ని ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేయగా..ఆంక్షల్ని దాటుకుని నరసరావుపేట బయలుదేరిన నేతల్ని పోలీసులు అరెస్టు చేశారు. వైకాపా నాయకులతో పోలీసులు కుమ్మక్కవటం వల్లే మాచర్లలో దమనకాండ జరిగిందని తెదేపా నేతలు ఆరోపించారు.
పల్నాడు జిల్లా మాచర్లలో వైకాపా శ్రేణుల దాడిని ఖండిస్తూ తెలుగుదేశం చేపట్టిన చలో పల్నాడు కార్యక్రమాన్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. మాచర్లలో శుక్రవారం జరిగిన ఘటనపై పోలీసు ఉన్నతాధికారులకు కలిసి ఫిర్యాదు చేసేందుకు నరసరావుపేట బయలుదేరిన... నేతల్ని పోలీసులు ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. సీనియర్ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనంద్‌బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, వర్ల రామయ్య, బుద్ధా వెంకన్న, జీవీ ఆంజనేయులు, చదలవాడ అరవిందబాబు, నజీర్ అహ్మద్, కోడెల శివరాం తదితర నేతల్ని నరసరావుపేట వెళ్లకుండా అడ్డుకున్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పోలీసుల వైఖరిపై నేతలు మండిపడ్డారు.
పోలీసుల ఆంక్షల వలయాన్ని చేధించుకుని తెదేపా నేతలు గుంటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి అంతా కలిసి నరసరావుపేట బయలుదేరగా... పోలీసులు అడ్డుకున్నారు. తెదేపా నేతల్ని స్టేషన్‌కు తరలించే క్రమంలో చోటు చేసుకున్న తోపులాట తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
తెదేపా నేతల్ని పోలీసులు బలవంతంగా నల్లపాడు స్టేషన్‌కు తరలించారు. గుంటూరు జిల్లాలో డీజీపీ ఉన్నప్పుడే మాచర్లలో దాడులు జరగటం పోలీసుల వైఫల్యమేనని తెదేపా నేతలు మండిపడ్డారు. ఘటనపై ఎస్పీ వ్యాఖ్యలను తప్పుపట్టారు.
మాచర్ల దాడులు నిరసిస్తూ పిడుగురాళ్లలో తెదేపా చేపట్టిన శాంతియుత ర్యాలీలో స్వల్పఉద్రిక్తత చోటుచేసుకుంది. తెదేపా ర్యాలీ మార్గంలోనే వైకాపా శ్రేణుల ర్యాలీ నిర్వహించాయి. ఇరు పార్టీల వారు ఎదురుపడటంతో ఘర్షణ వాతావరణం తలెత్తింది. పోలీసులు జోక్యంచేసుకుని ఇరువర్గాల్ని పంపించివేశారు.