Farmers Digging Wells to Protect Crops: దాహం వేసినప్పుడు బావి తవ్వడం కాదు.. ముందే జాగ్రత్తగా ఉండాలంటారు. అంటే రాబోయే పరిస్థితులను అంచనా వేసుకుని దానికి సరిపడా ప్రణాళిక, చర్యలు చేపట్టాలని దాని అర్థం. కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి అలాంటి ఆలోచనే లేదు. రిజర్వాయర్లలో నీరు ఉన్నప్పుడు నిల్వ చేయలేదు సరికదా.. ఇప్పుడు నీటి ఎద్దడితో పంటలు ఎండిపోతున్నాయని అన్నదాతల ఆందోళనను గాలికి వదిలేసింది.
ఎండిపోతున్న పంటలను ఎలాగోలా కాపాడుకోవాలనే ఆవేదనలో రైతులు ఇప్పటికిప్పుడు బావుల తవ్వకాలకు పూనుకున్నారు. రైతులు ఇలా నానాయాతన అనుభవించడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం అని రైతులు విమర్శిస్తున్నారు. సాగర్ జలాలు అందకపోవడంతో పంటలను కాపాడుకునేందుకు హడావిడిగా నేలబావులు తవ్వుతున్నారు పల్నాడు జిల్లా రైతులు.
రైతుల సమస్యలపై ప్రభుత్వంలో చలనం లేదు - వైసీపీ నాయకులకు చిత్తశుద్ది లేదు : బీటెక్ రవి
వర్షాభావ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ నివేదికల్ని పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం.. అందుబాటులో ఉన్న నీటిని ప్రణాళికాబద్దంగా అందించటంలోనూ విఫలమైంది. జూన్ నెలలోనే పంటలకు నీరందించామని గొప్పలకు పోయి ప్రచారం చేసుకుంది. కనీసం పట్టిసీమను పకడ్బందీగా నిర్వహించలేకపోయింది.
వర్షాలు లేకపోవడం, కృష్ణా నదిలోకి వరద రాకపోవటంతో పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో తీవ్రమైన సాగునీటి ఎద్దడి ఏర్పడింది. పల్నాడు జిల్లాలో మిర్చి సాగు చేస్తున్న రైతులు పంటను కాపాడుకునేందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. నీటిని ట్యాంకర్లతో తెచ్చి పంటలకు రక్షక తడులు అందిస్తున్నారు. నేలబావులు 30 నుంచి 40 అడుగులు తవ్వటం వల్ల నీటి ఊట పడుతోంది. ఆ నీటిని మోటార్ల ద్వారా అందిస్తూ మిర్చి పంటను కాపాడుకుంటున్నారు.
ప్రకృతి కరుణించలేదు, పాలకులు కనికరించడం లేదు - కరవు మండలాల ప్రకటనలో వివక్షపై రైతన్న ఆవేదన
పల్నాడు జిల్లాలో మిరప సాగు చేసే పలు ప్రాంతాల్లో చాలా చోట్ల.. ప్రస్తుతం కొత్త నేలబావులు దర్శనమిస్తున్నాయి. బోరుబావుల వ్యవస్థ వచ్చిన తర్వాత నేలబావులు తవ్వించుకునేవారు తగ్గిపోయారు. ఇప్పుడు ప్రభుత్వం సాగునీరు అందించలేని పరిస్థితుల్లో రైతులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
నేల స్వభావాన్ని బట్టి పంటలకు వారం నుంచి 10 రోజులకు ఓసారి నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది. అదపాదడపా వానలు పడితే భూగర్భ జలాలు పెరిగి బావిలో నీటి ఊట వస్తుంది. ఎలాగోలా పంటను కాపాడుకోవచ్చనే ఉద్దేశ్యంతో బావులు తవ్విస్తున్నామని రైతులు చెబుతున్నారు. బావిలో నీరు ఎక్కువగా వస్తే ఇతర రైతులకు కూడా సరఫరా చేస్తున్నారు. ఒక బావి తవ్వటానికి లక్ష రూపాయల వరకూ ఖర్చవుతోంది.
పంటలను కాపాడుకునేందుకు నీటి కుంటలను తవ్వుకునే రైతులకు ఉద్యాన శాఖ గతంలో రాయితీలు అందించేది. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటీవేమి లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న తరుణంలో రాయితీలు అందజేయాలని అన్నదాతలు కోరుతున్నారు.