West Rayalaseema Graduate MLC Election winning: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానంలో తెలుగుదేశం అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డికి డిక్లరేషన్ ఫారం అందింది. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో నిన్న ప్రకటించిన ఫలితాలలో రామగోపాల్‌రెడ్డి విజయం సాధించారు. శనివారం రాత్రి ఓట్ల లెక్కింపు పూరైన తర్వాత విజయాన్ని ప్రకటించిన కలెక్టర్ నాగలక్ష్మి.. డిక్లరేషన్ అందజేయలేదు. దీంతో టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఎట్టకేలకు ఈ రోజు ఉదయం రామగోపాల్‌రెడ్డికి కలెక్టర్ ధ్రువపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలవ శ్రీనివాసులు, పార్థసారథి, టీడీపీ నేతలు పాల్గొన్నారు. నానా హైరానా తర్వాత డిక్లరేషన్ రామగోపాల్ రెడ్డికి అందింది.
"ఈ నెల 13వ తేదీన కడప-అనంతపురం- కర్నూలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహించాము. 16వ తేదీ నుంచి ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి నిన్న పూర్తి చేశాము. వచ్చిన ఫలితాలను ఎన్నికల సంఘానికి పంపించాము. ఎన్నికల సంఘం రాత్రి 1:30 నిమిషాలకు ఫలితాలను వెల్లడించాడానికి అనుమతిని ఇచ్చింది. ఎన్నికలలో టీడీపీ తరఫు అభ్యర్థికి విజయాన్ని సాధించారు." -నాగలక్ష్మి, అనంతపురం కలెక్టర్
నిన్న విజయం ప్రకటించిన తర్వాత ఏం జరిగిందంటే: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానంలో తెలుగుదేశం అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి గెలుపొందినట్లు శనివారం రాత్రి 8 గంటలకు కలెక్టర్ నాగలక్ష్మి అధికారికంగా ప్రకటించారు. కానీ ధ్రువీకరణ పత్రం మాత్రం అందించలేదు. దీనిపై అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి, పలువురు తెలుగుదేశం నేతలు.. కౌంటింగ్ కేంద్రమైన అనంతపురం జేఎన్టీయూ ఎదుట బైఠాయించారు. సంయుక్త కలెక్టర్ కేతన్‌గార్గ్ కారును అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తత తలెత్తింది. వెంటనే రామగోపాల్‌రెడ్డితో పాటు ఇతర నేతలను బలవంతంగా అరెస్టు చేసిన పోలీసులు మూడో పట్టణ స్టేషన్‌కు తరలించారు.
కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు ఫిర్యాదు : పశ్చిమ సీమ విజేత భూమిరెడ్డికి డిక్లరేషన్ ఇవ్వకపోవడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఎన్నికల ఫలితాల విషయంలో అధికార పార్టీ అనుచిత చర్యలకు దిగిందని లేఖలో పేర్కొన్నారు. తెలుగుదేశం అభ్యర్థి గెలిచినా డిక్లరేషన్ ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి నుంచి, ఆయన కార్యాలయం నుంచి వచ్చిన ఒత్తిడి వల్లే డిక్లరేషన్ ఇవ్వకుండా ఆపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు లేఖపై స్పందించిన సీఈసీ.. రాష్ట్రానికి చెందిన ఎన్నికల అధికారులు, ఆర్వోతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
ఇవీ చదవండి :