Vijayawada Kanaka Durga Temple EO Issue: ఇంద్రకీలాద్రిపై ఈనెల 15 నుంచి 23వ తేదీ వరకూ దసరా వేడుకలు జరగనున్నాయి. దుర్గగుడి ఉత్సవాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 10 నుంచి 15 లక్షల మంది భక్తులు విచ్చేస్తారని అంచనా. ఇంద్రకీలాద్రి దసరా వేడుకలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో.. భారీగా ఖర్చు చేసి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది 7 కోట్ల రూపాయలను ఉత్సవాల నిర్వహణ కోసం కేటాయించారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చే భక్తుల కోసం పక్కాగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.
దసరా వేడుకలు మరో ఆరు రోజుల్లో ఆరంభం కానున్నాయి. ఇప్పటికీ ఏర్పాట్లు సరిగా చేయలేదు. చాలా పనులకు సంబంధించిన టెండర్లు సైతం ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఈవోలను మార్చుతూ ప్రభుత్వం ఒకదాని తర్వాత మరొకటి ఉత్తర్వులు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుతం ఆలయ ఈవోగా ఉన్న భ్రమరాంబ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లతో సన్నద్ధమవ్వగా ఆమెను ఆకస్మికంగా తప్పిస్తూ ప్రభుత్వం ఈనెల 1న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ స్థానంలో.. వైద్యారోగ్య శాఖలో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ఎం.శ్రీనివాస్‌ను అక్టోబరు 1వ తేదీన నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కానీ.. ఆయన ప్రస్తుతం నిర్వహిస్తున్న విధుల నుంచి రిలీవ్ చేయడంలో ఆలస్యం జరిగింది.
దీంతో మంచి ముహూర్తం చూసి.. దుర్గగుడిలో అడుగుపెట్టి ఆయన వెళ్లిపోయారు. ఒకవైపు దసరా వేడుకలు ముంచుకొస్తుండడం.. శ్రీనివాస్ రాక ఆలస్యం అవ్వడం.. పాత ఈవో భ్రమరాంబ ఇక్కడే దసరా వరకూ ఉండేందుకు ప్రయత్నాలు చేయడంతో.. సందిగ్ధం నెలకొంది. ఈ సమయంలో శ్రీనివాస్‌ను ఆపేసి.. ఆయన స్థానంలో కేఎస్ రామారావును ప్రభుత్వం నియమించడం గమనార్హం.
శ్రీనివాస్ రాకకు అడ్డంకులు ఏర్పడిన నేపథ్యంలో.. రామారావు విషయంలో భంగపాటు లేకుండా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లోనే తిరుపతి కలెక్టర్‌తో పాటు, దేవాదాయశాఖ అధికారులకు కూడా స్పష్టమైన సూచనలు చేశారు. రామారావును ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే విడుదల చేయాలని, ఆ విషయం ప్రభుత్వానికి తెలియజేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. అలాగే దుర్గగుడి ఈవోగా చేరిన తేదీని సైతం ప్రభుత్వానికి తెలియజేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
దీంతో శ్రీకాళహస్తిలో రామారావు ఆదివారమే రిలీవ్ అయిపోయారు. సోమవారం వచ్చి దుర్గగుడిలో ఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలిసింది. కేఎస్ రామారావు (Vijayawada Kanaka Durga Temple New EO) ఇప్పటికే శ్రీశైలం ఈవోగా పనిచేశారు. దుర్గగుడితో సమానమైన హోదా ఉన్న ఆలయంలో పనిచేసిన అనుభవంతో దసరా ఉత్సవాలను సజావుగా నిర్వహించగలరంటూ దేవాదాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ఇంద్రకీలాద్రి దసరా వేడుకల నిర్వహణ ఏర్పాట్లు నత్తనడకన సాగుతున్నాయి. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకునేందుకు కీలకమైన క్యూలైన్ల పనులు ఇప్పటికి సగం కూడా పూర్తికాలేదు. కనకదుర్గనగర్‌లో అదనపు ప్రసాదాల కౌంటర్లు, మూడు ఘాట్లలో జల్లు స్నానాల ఏర్పాట్లు, సీతమ్మవారి పాదాల వద్ద తాత్కాలిక కేశఖండనశాల.. లాంటి పనులు ఇంకా పూర్తికాలేదు.
దసరా వేడుకలలో కీలకమైన సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ఎక్కడ అనేది ఇప్పటికీ నిర్ణయించలేదు. మహామండపం దిగువున.. మల్లేశ్వరాలయం మెట్ల మార్గం వద్ద.. అన్నదానం ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అసంపూర్తిగానే ఉన్నాయి. దసరా ఏర్పాట్లను మరో ఐదు రోజుల్లో పూర్తిచేయడం.. కొత్త ఈవోకు సవాలుగా మారబోతోంది.
New Master Plan for Durga Temple: దుర్గగుడికి కొత్త మాస్టర్ ప్లాన్.. పాతది గ్రాఫిక్స్‌కే పరిమితం..!