Vijayawada CP Kanthi Rana Tata on Ganja: గంజాయి రవాణా చేస్తే వాహనాల సీజ్‌తో పాటు ఇకపై ఆస్తులను జప్తు చేస్తామని సీపీ కాంతిరాణా టాటా స్పష్టం చేశారు. డీజీపీ ఆదేశాలతో గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై శుక్రవారం రాత్రి పోలీస్ కమిషనర్ తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తరచూ తనిఖీల ద్వారా చాలా వరకు రవాణా నియంత్రించామని తెలిపారు. కేవలం ఆరు నెలల్లో 123 కేసులు నమోదు చేసి.. 314 మందిని అరెస్టు చేసినట్లు వివరించారు. 32 మంది రవాణా చేసే వారిని గుర్తించి, 8మంది పై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని సీపీ తెలిపారు.
ALSO READ: CP Kanti Rana on Murder Issue: ఆ హత్యకు గంజాయితో సంబంధం లేదు: సీపీ
గతంలో గంజాయి దొరికితే కేసులు మాత్రమే పెట్టే వాళ్లమని.. ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచి, ఎలా గంజాయి రవాణా అవుతుందో గుర్తించి తనిఖీ చేస్తున్నామన్నారు. అన్ని కాలేజ్‌లలో యువతకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని వివరించారు. విద్యార్థులు గంజాయి మత్తుకి అలవాటు పడితే తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో తాము తీసుకున్న చర్యలు రాష్ట్రవ్యాప్తంగా మంచి ఫలితాలు ఇచ్చాయన్నారు. ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో కూడా గంజాయిపై ప్రత్యేక నిఘా పెట్టారని, ఇటువంటి చర్యల వల్ల గంజాయి రవాణా చాలా వరకు తగ్గిందన్నారు.
గంజాయి పండించే పొలాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసి దాని ద్వారా ఉపాధి పొందేందుకు సహకరిస్తున్నట్లు సీపీ తెలిపారు. తాజాగా పంటపై దృష్టి పెట్టినందున రాబోయే రోజుల్లో గంజాయి మరింత తగ్గిపోతుందని అని సీపీ తెలిపారు. అలాగే గంజాయి కేసుల్లో దొరికితే ఆరు నెలల వరకు బయటకు వచ్చే అవకాశం లేకుండా సెక్షన్లు బలంగా పెడుతున్నామన్నారు. పాత నేరస్థులపై నిరంతరం తమ వాళ్ల పర్యవేక్షణ ఉంటుందన్నారు. గంజాయి సేవించడం ద్వారా నేరాలు ఎక్కువ జరుగుతున్నాయనేది అపోహ మాత్రమేనని సీపీ స్పష్టం చేశారు.
డయల్ యువర్ సీపీకి 12 ఫిర్యాదులు: విధి నిర్వహణలో పోలీసు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ప్రజా సమస్యలను ఫోన్ ద్వారా తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం నిర్వహించే పోలీస్ వెల్ఫేర్ డే, డయల్ యువర్ సీపీ కార్యక్రమానికి మొత్తం 37 ఫిర్యాదులు వచ్చాయి. సిబ్బంది విధి నిర్వహణలో ఎదుర్కొనే సమస్యలతో పాటు వారి బదిలీలు, సర్వీసులకు సంబంధించిన సమస్యలు తెలుసుకునేందుకు వారితో నేరుగా పోలీస్ కమిషనర్ సమావేశమయ్యారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
మొత్తం 25 ఫిర్యాదులు రాగా వాటి పరిష్కారం దిశగా సంబంధిత విభాగాలకు పంపించారు. సత్వరం వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. సిబ్బంది.. పోలీస్ వెల్ఫేర్ డేను వినియోగించుకోవాలని సీపీ విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలను ఫోన్ ద్వారా తెలుసుకునేందుకు శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు పోలీస్ కమిషనర్ డయల్ యువర్ సీˆపీˆ కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 12 ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించి పరిష్కరించాలని పోలీస్ కమిషనర్ సంబంధిత పోలీస్‌స్టేషన్ల అధికారులు, ట్రాఫిక్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.