Vambay Colony People Problems Due to Poor Sanitation: విజయవాడలో ఇళ్లు లేని నిరుపేదలకు గత ప్రభుత్వాలు వాంబే కాలనీలో ఇళ్లు కేటాయించాయి. ప్రస్తుతం 20 వేల మందికి పైగా ప్రజలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. దాదాపుగా.. 20 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్న వాంబే కాలనీ లబ్ధిదారులు మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో డ్రైనేజ్ కోసం వేసిన పైప్‌లైన్ పాడైపోవడంతో.. మురుగునీరు నివాసాల్లోకి వస్తోంది. కాలనీచుట్టు మురుగు నీరు పారుతుండంతో స్థానికులు నరకం చూస్తున్నారు. ఇదేమని కార్పోరేషన్ అధికారులను అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదని వాపోతున్నారు.
కాలనీ చూట్టు మురుగు నీరు పారుతూ.. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో.. పందులు, దోమలు, ఈగలతో జనం సహవాసం చేయాల్సి దుస్థితి నెలకొంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఇంట్లో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ బారినపడతున్నారని స్థానికులు వాపోతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉందని స్థానికులు గగ్గొలుపెడుతున్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై.. కార్పొరేషన్ అధికారులను అడిగినా స్పందించే నాథుడేలేడని చెబుతున్నారు.
Poor Drainage System in Vijayawada : నగరానికి శాపంలా డ్రైనేజీ వ్యవస్థ.. ఎక్కడ చూసినా మురుగే..
మరొక వైపు తమ కాలనీలో గంజాయి బ్యాచ్, మందు బాబుల ఆగడాలు పెరిగిపోయాయని.. మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి అయితే కాలనీలో నవడలేకుండా ఉన్నామని చెప్పారు. తాగిన మైకంలో మద్యం బ్యాచ్ ఇళ్లపై రాళ్ల దాడులు చేస్తున్నారని..భయపడుతున్నారు. పోలీసులకు సమాచారం ఇస్తే వారు వచ్చిన కొద్దిసేపు పక్కకు తప్పుకుంటున్నారని.. తర్వాత పరిస్థితి యథావిధిగా మారుతోందని వాపోతున్నారు. కాలనీ విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోదామన్నా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటి అద్దెలు కట్టలేక కష్టాలు దిగమింగుతూ ఇక్కడే ఉంటున్నామని స్థానికులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.
ఒకవైపు మౌళిక సదుపాయాల లేమితో ఇబ్బందులు పడుతుంటే మరొకవైపు తమ ప్రాంతంపై అధికారుల అలసత్వం తమను మరింత అవస్థలకు గురి చేస్తుందని పేర్కొన్నారు. తమ కాలనీకి కూత వేటు దూరంలో పంట పొలాలు ఉన్నా మంచి గాలి పీల్చడానికి లేదని అవేదన చెందుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో పందులు, విష పురుగులు తిరుగుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని తాము కూలీ పనులు చేసుకుంటేనే తమకు జీవనాధారమని.. వచ్చిన కూలి డబ్బుల్లో సగం హస్పిటల్ ఖర్చులకే అయిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాలనీలో మౌళిక సదుపాయాలు లేకపోవడంతో ఇక్కడ జీవనం సాగించలేక చాలామంది కాలనీని విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని తెలిపారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇంటి అద్దెలు చెల్లించలేక కష్టాలను దిగమింగుతూ తాము ఇక్కడే ఉంటున్నామని వివరించారు. డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తే తమకు ఈ పరిస్థితి రాదని కాలనీవాసులు అంటున్నారు. విష జ్వరాలు కారణంగా కుటుంబం మొత్తం తీవ్ర అవస్థలు పడుతున్నామని చెబుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని అంటూన్నారు. ప్రభుత్వం తాగునీరు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించి.. తమను ఆదుకోవాలని కోరుతున్నారు.