CID raids at margadharsi offices: హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించింది. బలవంతపు చర్యలొద్దంటూ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను విస్మరించి.. మార్గదర్శి చిట్‌ఫండ్ కార్యాలయాలపై నిబంధనలకు విరుద్ధంగా చర్యలు చేపట్టింది. బ్రాంచి మేనేజర్ల వివరణలను పరిగణనలోకి తీసుకోవాలని.. ఆ తర్వాత చట్టంలోని సెక్షన్ 46(3) నిబంధనల మేరకు నిష్పాక్షికంగా వ్యవహరించాలని చిట్ రిజిస్ట్రార్లను స్పష్టంగా ఆదేశించినా.. వాటిని ఉల్లంఘించింది.
మార్గదర్శి చిట్‌ఫండ్ మేనేజర్లను సీఐడీ శనివారం ఉదయం నుంచే వారి నివాసాల్లో అదుపులోకి తీసుకొని బ్రాంచి కార్యాలయాలకు తీసుకెళ్లింది. సోదాల పేరుతో ఇబ్బందులకు గురి చేసింది. ఆయా శాఖల్లోని మహిళా సిబ్బందినీ రాత్రి వరకూ కదలకుండా కట్టడి చేసింది. నిబంధనలకు విరుద్ధంగా మధ్యరాత్రి దాటినా సోదాలను కొనసాగించింది. మార్గదర్శిపై రాష్ట్ర ప్రభుత్వం, రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల దురుద్దేశపూర్వక చర్యలను ముందుగానే గుర్తించి.. యాజమాన్యం గతేడాది డిసెంబరులోనే హైకోర్టును ఆశ్రయించింది. డిసెంబరు 26న విచారణ జరిపిన హైకోర్టు.. చిట్ రిజిస్ట్రార్లు పంపిన నోటీసుకు వివరణ ఇవ్వాలని ఆయా బ్రాంచి మేనేజర్లను ఆదేశించింది. బలవంతపు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో బ్రాంచి మేనేజర్లు వివరణ ఇచ్చినా, సీఐడీ అధికారులు కక్షసాధింపు చర్యలకు దిగారు. హైకోర్టుకు మూడు రోజులు వరుస సెలవులున్న నేపథ్యంలో శనివారం తనిఖీలకు తెరలేపారు. చట్ట నిబంధనలను పాటించాలన్న హైకోర్టు ఆదేశాలకు తిలోదకాలిచ్చారు.
ఉదయం నుంచి రాత్రి వరకూ.. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు, అనంతపురం, నరసరావుపేటల్లోని మార్గదర్శి చిట్‌ఫండ్ కార్యాలయాల్ల్లో సీఐడీ అధికారులు, సిబ్బంది శనివారం ఉదయం నుంచి తనిఖీలు చేపట్టారు. వారితోపాటు ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ మేనేజర్లను, సిబ్బందిని ప్రశ్నిస్తూనే ఉన్నారు. అనేక రికార్డులు తనిఖీ చేశారు. ఖాతాదారులను లోపలికి అనుమతించలేదు. విజయవాడ లబ్బీపేటలోని మార్గదర్శి బ్రాంచి మేనేజరు బండారు శ్రీనివాసరావును ఉదయం ఆరున్నర గంటల సమయంలోనే సీఐడీ అధికారులు ఇంటి వద్దకు వచ్చి అదుపులోకి తీసుకుని బ్రాంచి కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆయనతో పాటు కార్యాలయ అకౌంటెంట్, కంప్యూటర్ ఆపరేటరు, ఇతర సిబ్బందిని పిలిపించి, తాళాలు తీయించి విచారణ చేపట్టారు. గుంటూరు అరండల్‌పేటలోని మార్గదర్శి బ్రాంచి మేనేజర్ శివరామకృష్ణను శనివారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో ఇంటివద్ద అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి సీఐడీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో బ్రాంచి కార్యాలయానికి తీసుకెళ్లి ఫైళ్లు తనిఖీ చేశారు. ముఖ్యమైన విభాగాలకు చెందినవారిని ప్రత్యేకంగా లోపలికి పిలిచి ఒక్కొక్కరినీ విచారించారు. విశాఖ సీతంపేట మార్గదర్శి కార్యాలయంలో ఉదయం నుంచి తనిఖీలు చేపట్టారు. మేనేజర్ రామకృష్ణను, సిబ్బందిని విచారించారు. కంప్యూటర్లు, రికార్డులు పరిశీలించారు. ఫోన్లు స్విచాఫ్ చేయించి వారితో మాట్లాడారు.
అర్ధరాత్రి ఒంటిగంట వరకు తనిఖీలు.. రాజమహేంద్రవరంలోని మార్గదర్శి బ్రాంచి మేనేజరు రవిశంకర్ ఇంటికి ఉదయం ఆరున్నర గంటలకే సీఐడీ అధికారులు వచ్చారు. 10 గంటల 45 నిమిషాల వరకు ఆయనను ఇంట్లోనే ప్రశ్నించారు. తర్వాత మార్గదర్శి కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఉదయం 11 గంటలకు కార్యాలయాన్ని తెరిపించి విధులకు వచ్చిన సిబ్బందిని లోపలికి అనుమతించారు. ఖాతాదారులను వెనక్కి పంపేశారు. ఒకటి రెండు చోట్ల ఏజెంట్లనూ పిలిపించి ప్రశ్నించారు. చిట్స్ ఎందుకు వేయించారు, ఎంతమందితో కట్టించారనే వివరాలు ఆయనను అడిగి తెలుసుకున్నారు. ఏలూరు మార్గదర్శి కార్యాలయంలోనూ తనిఖీలు చేశారు. ఉదయం 9గంటలకే పది మంది రెండు విడతలుగా కార్యాలయానికి వచ్చారు. మేనేజర్ ప్రసాద్ విధులకు హాజరుకాకపోవడంతో మిగతా సిబ్బందిని విచారించారు. మార్గదర్శి సిబ్బంది ఒకరిని ఉదయం 11 గంటల సమయంలో తహసీల్దారు కార్యాలయానికి తీసుకెళ్లి, అధికారి అందుబాటులో లేకపోవడంతో ఆయనతో ఫోన్లో మాట్లాడి మళ్లీ వెనక్కి తీసుకొచ్చారు. రాత్రి 9గంటల సమయంలో కొందరు అధికారులు కొన్ని ఫైళ్లను వెంట తీసుకుని వెళ్లారు.
అనంతపురం మార్గదర్శి కార్యాలయానికి ఉదయం 10 గంటలకు సీఐడీ, ఇతర అధికారులు 20 మంది వరకూ వచ్చారు. మేనేజరు గోపి వ్యక్తిగత పనులపై వేరే ప్రాంతాలకు వెళ్లారు. కార్యాలయంలో ముఖ్యమైన 8 మంది సిబ్బందిని ఉంచి, మిగిలినవారిని బయటకు పంపేశారు. అకౌంటెంటు, కంప్యూటరు ఆపరేటర్లు, ఇతరులను కార్యాలయంలో ఉంచి ప్రశ్నించారు. ముగ్గురు మహిళా ఉద్యోగులతోపాటు అందరినీ అర్ధరాత్రి ఒంటిగంట వరకు కార్యాలయంలోనే ఉంచి.. తనిఖీలు కొనసాగించారు. రాజమహేంద్రవరం మినహా అన్నిచోట్లా ఉద్యోగులందరినీ కార్యాలయాల్లోనే ఉంచి, అర్ధరాత్రి దాటినా తనిఖీలు చేశారు. నరసరావుపేటలో తనిఖీలు అర్ధరాత్రి 12:10కి ముగిశాయి. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని మార్గదర్శి కార్యాలయానికి ఉదయం 11 గంటల తర్వాత సీఐడీ, ఇతర అధికారులు వచ్చి తనిఖీలు ప్రారంభించారు. అక్కడి మేనేజరు అందుబాటులో లేకపోవడంతో సిబ్బందిని ప్రశ్నించారు.
ఎఫ్‌ఐఆర్‌లు నమోదు.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ తీవ్ర నేరాలకు పాల్పడిందంటూ.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఏపీ సీఐడీ తెలిపింది. ఈ కేసులో రామోజీరావు, ఎండీ శైలజతో పాటు బ్రాంచి మేనేజర్లను నిందితులుగా పేర్కొంది. ఈ మేరకు పత్రికా ప్రకటనను శనివారం సాయంత్రం ఎంపిక చేసిన కొన్ని మీడియా సంస్థలకు విడుదల చేసింది. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, అనంతపురంలోని అసిస్టెంట్ రిజిస్ట్రార్స్ ఆఫ్ చిట్స్ ఇచ్చిన ఫిర్యాదుపై సెక్షన్ 120(బి), 409, 420, 477(ఎ), రెడ్ విత్ 34 ఆఫ్ ఐపీసీ, ఆంధప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఇన్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 1999లోని సెక్షన్ 5, చిట్‌ఫండ్స్ యాక్ట్ 1982లోని సెక్షన్ 76, 79 కింద ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: