TDP Leaders Fires on YSRCP Govrenment: రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. దళితులపై వైసీపీ నేతల దాడులు మితిమీరుతున్నాయని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.. వైసీపీ కాలకేయులను తయారు చేసి దళితులపైకి వదిలారని అచ్చెన్న ఆగ్రహించారు. కాలకేయుల సంఘం అధ్యక్షుడిలా వైసీపీ నేత కళ్లం హరికృష్ణారెడ్డి వ్యవహరిస్తున్నాడని ఆయన ఆరోపించారు. వైసీపీలో ఆకు రౌడీలు దగ్గర నుంచి బడా నేతల వరకు ప్రజలపై దాడులు చేస్తూ హింసలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మాట్లాడుకుందాం రమ్మని పిలిచి కంతేరు దళితులపై దాడి చేస్తారా అంటూ మండిపడ్డారు. దళితులపై దాడి జరిగి 24 గంటలు అవుతున్నా దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయకపోవడం దుర్మార్గమని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ దళిత మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఈ దాడులు కనిపిచడం లేదా అని నిలదీశారు. దళితులపై దాడులు జరుగుతుంటే వైసీపీ దళిత నాయకులు గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతున్నారా అంటూ మండిపడ్డారు. మారణాయుధాలతో అనంతపురంలో స్వైర విహారం చేసిన నాడే హరికృష్ణారెడ్డిపై చర్యలు తీసుకుని ఉంటే దళితులపై దాడి జరిగేది కాదని అన్నారు. తాడేపల్లి ప్యాలెస్‌లో హరికృష్ణారెడ్డి లాంటి విషపు నాగులను పాలు పోసి పోషిస్తున్నారని విమర్శించారు. వీరి ఆగడాలకు దళితులు బలవ్వాలా అంటూ ప్రశ్నించారు. కాలకేయుల పాలన నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుందా అని దళితులు వేచిచూస్తున్నారని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్దంగా ఉన్నారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.
- MLA Dola Fire on Police: హనుమాయమ్మది ముమ్మాటికి రాజకీయ హత్యే.. పోలీసుల మాటలు శోచనీయం: ఎమ్మెల్యే డోలా
రాష్ట్రాన్ని దుర్మార్గాలకు కేంద్రంగా మార్చారు: రాష్ట్రంలో 5 నిమిషాలకో అత్యాచారం, పది నిమిషాలకో అఘాయిత్యం, అరగంటకో హత్య జరిగే పాలన దేని కోసమో, ఎవరికోసమో ముఖ్యమంత్రి జగన్ చెప్పాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ అసాంఘిక కార్యకలాపాలకు కారణం ముఖ్యమంత్రి పెంచిపోషిస్తున్న గంజాయి, మాదకద్రవ్యాల మాఫియానే అని ఆయన ఆరోపించారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ముఖ్యమంత్రి ఎంతగా రాష్ట్రాన్ని దుర్మార్గాలకు కేంద్రంగా మార్చాడో స్పష్టం చేస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో 52వేల మంది మహిళలపై అఘాయిత్యాలు, ఇతరత్రా దారుణాలు జరిగాయని ఆరోపించారు. 22వేల 278 మిస్సింగ్ కేసులు నమోదైతే, 9మంది యువతలు, బాలికలపై యాసిడ్ దాడులు జరిగాయన్నారు. 32మంది మహిళలు సామూహిక మానభంగాలకు గురయ్యారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఇలా ప్రతి వర్గం జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలనకు బలైందని విమర్శించారు. సొంత తల్లి, చెల్లి రక్షణ కోసం పరాయి రాష్ట్రం వెళ్లారంటే ముఖ్యమంత్రి శాంతి భద్రతల్ని ఎంత బాగా అమలు చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చని ఆలపాటి రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు.