Students Future Does Not Care Jagan Government : సీఎం జగన్ కోపమంతా చంద్రబాబుపైనే.. ఆయనపై కక్ష తీర్చుకునేందుకు ప్రజావేదికతో మొదలు పెట్టి.. రాజధాని అమరావతినీ ధ్వంసం చేశారు. రైతులకు బతుకునిచ్చే పోలవరం ప్రాజెక్టును భ్రష్టుపట్టించేందుకూ వెనకాడలేదు. అయినా కసితీరక నైపుణ్య కుంభకోణం పేరుతో చంద్రబాబును అరెస్టు (Chandrababu Naidu Arrest in Skill Development Scam) చేశారు. అయితే అందుకు నాశనం చేసిందేంటో తెలుసా? పిల్లలను నిపుణులుగా తీర్చిదిద్దే శిక్షణ కేంద్రాలనే..! బలి చేసింది దేన్నో తెలుసా? మన పిల్లల బంగారు భవిష్యత్తునే.
Jagan Government Allegations on Siemens and Designtech Companies : ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్ స్థాయిలోనే మన విద్యార్థులకు శిక్షణ ఇచ్చి.. చదువు పూర్తయ్యే నాటికే వారిని ఉద్యోగాలకు సిద్ధం చేసేందుకు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను చంద్రబాబు ఏర్పాటు చేశారు. ఆయనపై పగ తీర్చుకునేందుకు ఈ నైపుణ్య శిక్షణ కేంద్రాలనే జగన్ చంపేస్తున్నారు (Jagan is Killing Skill Training Centers) . రాష్ట్రంలో శిక్షణ ఇస్తున్న సీమెన్స్, డిజైన్‌టెక్ వంటి సంస్థలపై బురద జల్లుతున్నారు. ఇలా చేస్తే మరే సంస్థ అయినా రాష్ట్రానికి వస్తుందా అని కూడా ఆలోచించడం లేదు.
రాష్ట్రం నాశనమైతే నాకేంటి? అరాచకమే నా ఎజెండా అనేలా హిట్లర్, నీరో లాంటి నిరంకుశ పాలకులకే పెద్దన్నగా తయారయ్యారు. 73 ఏళ్ల చంద్రబాబుపై పగ సాధించేందుకు ఒక తరం యువత భవితను జగన్ నాశనం చేశారు. ఈ రోజు కాకుంటే రేపైనా చంద్రబాబు న్యాయ పోరాటం ద్వారా అక్రమ కేసుల నుంచి బయటపడొచ్చు. మన పిల్లలు మాత్రం కోల్పోయిన భవితను తిరిగి అందుకోలేరు. మనం మేలుకునేలోపు వారి తలరాతలే మారిపోతాయి. అప్పుడూ, ఇప్పుడూ సీఎం జగన్, ఆయన మంత్రులు, అనుయాయుల పిల్లల భవిష్యత్తుకు వచ్చిన నష్టం, కష్టమేమీ ఉండదు. ఓడిపోయేది ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా చదువుకునే రేపటి తరం పేద యువత, వారి కలలే..! గెలిచేది పేదల పిల్లలకు పెద్దపెద్ద ప్యాకేజీలతో ఉద్యోగాలు ఎందుకనే కుటిల రాజకీయనేతలే!
Labs in Government Colleges and Universities Lack Basic Facilities : ప్రభుత్వ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లోని ల్యాబ్‌లలో మౌలిక సౌకర్యాలు లేవు. బోధకుల కొరత వెన్నాడుతోంది. ఇక్కడ చదువు పూర్తి చేసిన వారికి.. వెంటనే ఉద్యోగాలు లభించే అవకాశాలు తక్కువ. చదువు పూర్తి చేసే వారిలో ప్రతిభావంతులైన 10 శాతం మందినే కంపెనీలు ఎంపిక చేసుకుంటున్నాయి. మిగిలిన వారికి నైపుణ్యం అవసరమని చెబుతున్నాయి. కంపెనీలు కోరుతున్నట్లుగా.. వీరందరినీ ఉద్యోగ అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దేందుకే నైపుణ్యాభివృద్ధి సంస్థను చంద్రబాబు ఏర్పాటుచేశారు.
ప్రతిష్ఠాత్మక సంస్థ సీమెన్స్‌తో ఒప్పందం చేసుకుని 6 ఎక్స్‌లెన్స్ కేంద్రాలు, 36 నైపుణ్యాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేశారు. ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆయా కేంద్రాల్లోనే 2.13 లక్షల మందికి శిక్షణ ఇప్పించారు. 72 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. దేశంలో మరెన్నో రాష్ట్రాలు నైపుణ్యాభివృద్ధి అవసరాన్ని గుర్తించి, సీమెన్స్‌తో ఒప్పందం చేసుకున్నాయి. కొన్ని ప్రముఖ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు తమ విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు నేరుగా సీమెన్స్‌తో కలిసి పని చేస్తున్నాయి.
మన యువత నిపుణులు కావాలని, పేరున్న సంస్థల్లో ఉద్యోగాలు దక్కించుకోవాలని పెద్ద ప్యాకేజీలతో జీతాలు పొందాలని చంద్రబాబు ఆలోచించారు. జగన్ మాత్రం చంద్రబాబుపై పగ సాధించడమే లక్ష్యంగా నడిచారు. ఆయన తెచ్చిన నైపుణ్య శిక్షణ కేంద్రాలను చంపేసేలా పనిచేస్తున్నారు. చంద్రబాబును కేసులో ఇరికించాలనే దురాలోచనతో మన పిల్లల భవిష్యత్తునూ దెబ్బతీసేందుకు సిద్ధమయ్యారు.
రాష్ట్రంలో బాగా పని చేస్తున్న మూడు ఎక్స్‌లెన్స్ కేంద్రాలను మూసి వేయించారు. అక్కడున్న కోట్ల రూపాయల విలువైన యంత్ర పరికరాలు, సాప్ట్‌వేర్‌ను నిరుపయోగంగా మార్చారు. యువతకు శిక్షణ దొరకకుండా చేశారు. మరి కొన్నిచోట్ల కేంద్రాలను మొక్కుబడిగా మార్చారు.
సీమెన్స్ (Siemens) ఒప్పందంలో నిధులు దారిమళ్లాయని చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. క్షేత్ర స్థాయిలో నైపుణ్య శిక్షణ కేంద్రాలను పరిశీలించకపోయినా రాజకీయ ప్రయోజనాల కోసం సీమెన్స్, డిజైన్‌టెక్ లాంటి పేరున్న సంస్థలపై బురద చల్లారు. తాము తప్పేమీ చేయలేదని, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మరెన్నో రాష్ట్రాల్లో మచ్చ లేకుండా ప్రాజెక్టులు చేశామని వారు చెబుతున్నా సీఐడీ మాత్రం తాము అనుకున్న కోణంలోనే విచారణ చేస్తోంది. పదే పదే ఒకే తరహా ఆరోపణలు చేస్తోంది.
నైపుణ్య శిక్షణ అందకపోతే విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకమవుతుంది. వారికి ఉద్యోగాలిచ్చేందుకు సంస్థలు ముందుకు రావు. కోట్ల రూపాయలతో తమ పిల్లలను విదేశాల్లోని పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లో చదివించే పేదల పక్షపాతికి.. నైపుణ్య శిక్షణ ప్రాధాన్యం తెలియదనుకోలేం. అయినా కావాలనే దాన్ని విధ్వంసం చేస్తున్నారంటే అందుకు కారణం చంద్రబాబుపై పగ సాధించాలనే క్షుద్ర రాజకీయం కాక మరేంటి?
నిజంగా యువత సంక్షేమం కోరుకునే ప్రభుత్వమైతే ఎక్స్‌లెన్స్ కేంద్రాలను కొనసాగించడంతో పాటు మరింత విస్తృత పరుస్తుంది. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు మరిన్ని పేరున్న సంస్థలను రాష్ట్రానికి ఆహ్వానిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి, సీఐడీకి ఆ ఆలోచనే కొరవడింది. నైపుణ్య శిక్షణ కేంద్రాలను చంపేసేలా సీమెన్స్, డిజైన్‌టెక్‌పై బురదజల్లుతున్నాయి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ యువతకు (Skill Training for Youth) ప్రశ్నార్థకంగా తయారైంది. దీంతో చదువు పూర్తయ్యాక పొరుగు రాష్ట్రాలకు వెళ్లి నైపుణ్య శిక్షణ తీసుకోవాల్సి వస్తోంది. ఇందుకు ఒక్కో విద్యార్థి సగటున 50 వేల నుంచి లక్ష వరకు ఖర్చుచేయాల్సి వస్తోంది. శిక్షణ తీసుకోవాలంటే కొన్ని వారాలు, నెలల పాటు అక్కడే ఉండాలి. వీరిలో ఎక్కువమంది ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో చదువుకున్న పేద విద్యార్థులే.
ఇతర రాష్ట్రాలకు వెళ్లి శిక్షణ తీసుకోవాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు నిరుపేద కుటుంబాల విద్యార్థులకు భారమే. ఒక వేళ ఖర్చుపెట్టినా సీమెన్స్, ఇతర పెద్ద సంస్థల ఆధ్వర్యంలో అందించే తరహా శిక్షణ అక్కడ దొరకదు. అదే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో అయితే ఈ శిక్షణ అంతా ఉచితమే. పైగా చదువుతోపాటే ఈ శిక్షణ ఇవ్వడంతో, చదువు పూర్తి కాగానే ఉద్యోగాలు లభిస్తాయి. యువతకు బంగారు భవిష్యత్తే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం ఆలోచిస్తే వారికి నైపుణ్యం అందకుండా వైసీపీ మోకాలడ్డుతోంది.