Anti Microbial Resistance : దైనందిన జీవితంలో మందులు ఒక భాగమై పోయాయి. చిన్న వ్యాధుల నుంచి తీవ్రమైన రోగాల వరకు ప్రతిదీ నయం కావటానికి మందులను వినియోగిస్తున్నాం. ఈ మందులలో యాంటీబయాటిక్స్ తప్పకుంటా ఉంటున్నాయి. ఇప్పుడు ఆ యాంటీబయాటిక్స్ వినియోగం ప్రపంచ మానవాళిని పెను ముప్పులోకి నెట్టివేస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న యాంటీబయాటిక్స్లలో 60 శాతం మేరకు వ్యాధులపై ప్రభావం చూపటం లేదని.. వైద్య నిపుణులు అంటున్నారు.
వ్యాధి చిన్నదైనా పెద్దదైనా నయం చేయటంలో యాంటీబయాటిక్స్ కీలకపాత్ర పోషిస్తాయి. వ్యాధులను తగ్గించటంలో ప్రముఖపాత్ర పోషించే ఈ యాంటీబయాటిక్స్ ప్రభావం మానవ శరీరంలో నానాటికి తగ్గిపోతూ వస్తోంది. ఇందుకు ప్రధాన కారణం యాంటీబయాటిక్ మందులను విరివిగా వినియోగించటమేనని నిపుణులు అంటున్నారు. మితిమీరిన వినియోగం, నిపుణుల సలహా లేకుండా ఇష్టారితీన వినియోగిస్తే.. వ్యాధి కారకాలు రోగనిరోధక శక్తి పెంచుకుని.. ఏ మందుకు లొంగకుండా తయారవుతాయని నిపుణులు అంటున్నారు. ఇలా లొంగకుండా తయారు కావటాన్ని ఏఎంఆర్ (యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్) అంటారు. దీనివల్ల రోగిలో వ్యాధి అంతం కాక చివరికి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏఎంఆర్ ముప్పుపై కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్రాల వారిగా ప్రత్యేక నోడల్ అధికారులను నియమించి ఏఎంఆర్ స్థితిగతులపై ఆరా తీస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోనూ ఏఎంఆర్‌పై కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ అధికారులు, రాష్ట్రంలోని మైక్రోబయాలజిస్ట్లతో చర్చించారు. ఈ చర్చలో వ్యాధులను కలిగించే సూక్మజీవులలో, వ్యాధికారకలలో యాంటీబయాటిక్స్ అధిక వినియోగం వల్ల వస్తున్న మార్పులపై అధ్యయనం చేయాలని అన్నారు. అవి ఏ మందుకు లొంగకపోవటం వల్ల రోగిలో మరణం సంభవిస్తోందని అంటున్నారు. అందువల్ల వాటిని అదుపు చేయటానికి కొత్త మందులు కనుగొనాల్సి వస్తోందని అంటున్నారు.
యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ యాక్షన్ ప్లాన్ తయారు చేయాటంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో నాల్గొవ స్థానంలో ఉందని వైద్య నిపుణులు తెలిపారు. అందులో భాగంగా ఒక వ్యక్తికి వచ్చిన రోగానికి సంబంధించిన వ్యాధికారకాలపై పరిశోధనలు చేస్తున్నామని పేర్కొన్నారు. అవి ఎలా అదుపులోకి వస్తాయనే ఆంశాన్ని కనుక్కుంటున్నామని అన్నారు. అంతేకాకుండా ఆవి ఏ మందుకు లొంగుతాయో ల్యాబ్‌లో కనుక్కుంటున్నామని వెల్లడించారు. ఇలా కనుక్కున్న సమాచారాన్ని ప్రభుత్వానికి అందిస్తామని వివరించారు. ఇలా చేయటం ద్వారా ప్రభుత్వం ఇతర వైద్యాలయాలకు, వైద్య కళాశాలలకు, పరిశోధన స్థానాలకు అందించటం వల్ల ప్రజారోగ్యం మెరుగవుతుందని వారు తెలిపారు.
"సూక్మజీవులన్ని రోగ నిరోధక శక్తి పెంచుకుని ఏ మందుకు లొంగకుండా తయారవుతున్నాయి. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్‌ను అభివృద్ధి చేసుకుంటున్నాయి. దీనివల్ల కచ్చితంగా కొత్త మందులు కనుక్కొవాల్సి వస్తోంది. దీనికి సుమారు 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుంది." - డాక్టర్ శ్రీనివాసరావు, మైక్రోబయాలజిస్ట్
యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల రోగులు ఏ జబ్బుతో అయితే ఆసుపత్రిలో చేరతాడో.. అదికాకుండా కొత్త వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. దీనిని తగ్గించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయగా.. నూతనంగా రాష్ట్రస్థాయి ఏఎంఆర్ రెఫరల్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మితిమీరిన యాంటీబయాటిక్స్ వాడకం తగ్గించాలని.. ఆసుపత్రులలో నూతన ఇన్ఫెక్షన్లు రాకుండా చర్యులు చేపట్టాలని కోరుతున్నారు.
ఏఎంఆర్ వల్ల వ్యాధులు తగ్గకపోవటమే కాకుండా.. ఆసుపత్రిలో రోగులను చేర్పించినపుడు తోటి రోగులకు సంక్రమించే ఆవకాశం ఉందని కేంద్ర వైద్య ఆరోగ్యాధికారులు అంటున్నారు. కేంద్రం ఏఎంఆర్ ముప్పును తగ్గించేందుకు చర్యలు చేపట్టిందని.. అందుకు రాష్ట్రాలకు నిధులు సమాకూరుస్తుందని తెలిపారు. ఆ నిధులను పరిశోధన ల్యాబ్‌ల కోసం, అవగాహన కల్పించటం కోసం, ఏఎంఆర్ ముప్పును తగ్గించే ఇతర కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు వివరించారు.
ఇవీ చదవండి :