Sankalpasiddhi scandal: సంకల్ప సిద్ధి కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కిరణ్ ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. గతంలో కూడా నిందితుడు 2, 3 సంవత్సరాల పాటు అజ్ఞాతంలోనే ఉండేవాడని పోలీసులు గుర్తించారు. అతన్ని విచారిస్తే కేసు ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. వ్యాపారాన్ని త్వరితగతిన అభివృద్ధి చేసేందుకు నియమించిన 14 మంది కోర్ కమిటీ ఏజెంట్లని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. వీరితో పాటు కోటికి పైగా డిపాజిట్లు వసూలు చేసిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
బంధువుల పేరిట ఆస్తులు.. ప్రకాశం జిల్లా కనిగిరి, కృష్ణా జిల్లా గన్నవరం, అనంతపురం, బళ్లారి, ఇలా పలు ప్రాంతాల్లో డిపాజిటర్ల సొమ్ముతో కొనుగోలు చేసిన స్థిర, చరాస్తులను అటాచ్‌మెంట్ చేస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అటాచ్‌మెంట్‌ను చట్టబద్ధం చేసేందుకు పోలీసులు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ ప్రక్రియ త్వరలో పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో వందల కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేశారు. విజయవాడలోని పటమట, సూర్యారావుపేట సైబర్ స్టేషన్లతో పాటు అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గం పీఎస్‌లలోనూ కేసులు నమోదు అయ్యాయి. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గుత్తా వేణుగోపాలకృష్ణ.. పలు ఆస్తులను తన బంధువుల పేరిట రిజిస్టర్ చేసినట్లు విచారణలో తేలింది. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని డూప్లెక్స్ ఇంటిని రూ.1.15 కోట్లతో కొనుగోలు చేసి, వనిత అనే మహిళ పేరిట రిజిస్టర్ చేశారు. సంకల్ప సిద్ధి కుంభకోణం వెలుగులోకి వచ్చే రెండు నెలల ముందు రూ.5 కోట్లు వెచ్చించి బళ్లారిలోని భూములును ఈమె పేరిటే కొనుగోలు చేశారు. కర్ణాటకలోని హోస్పేటలో మరో రెండు ప్లాట్లను కూడా కొనుగోలు చేశారు.
సంకల్ప సిద్ధి కంపెనీ పేరిట కూడా వివిధ జిల్లాల్లో భూములు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో 75 ఎకరాలు కొనేందుకు సుధేనా ఆగ్రోఫామ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం జరిగింది. ఇందులో 40 ఎకరాల కోసం రూ. 6 కోట్లు నగదు ముట్టచెప్పారు. మిగిలిన 35 ఎకరాల కోసం రూ.1.5 కోట్లు బయానా చెల్లించారు. కనిగిరిలోని ఏసలగూడెంలో మూడున్నర కోట్లతో 20 ఎకరాలను కొన్నారు. ప్రకాశం జిల్లాలోనే సీఎస్ పురం మండలంలో రూ.6 కోట్లతో 15 ఎకరాలు, అనంతపురం జిల్లా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం సమీపంలోని ఇటుకులపల్లిలో కోటి రూపాయలతో 8 ఎకరాలు కొనుగోలు చేశారు. కర్నూలు జిల్లా నన్నూరులో తొమ్మిది ఎకరాలు, ఖమ్మం జిల్లా గంగారంలోనూ భూమిని కొన్నారు. గత ఏడాది మే నెలలో 'సంకల్పసిద్ధి ఈకార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్' పేరుతో రిజిస్టర్ అయింది.
నాగలక్ష్మి స్థానంలో కిరణ్.. గుత్తా వేణుగోపాలకృష్ణ ఎండీగా, సోదరి వరుస అయ్యే వెంకట నాగలక్ష్మి డైరెక్టర్‌గా నమోదు చేశారు. కిరణ్ బళ్లారి నుంచి విజయవాడకు వచ్చి వ్యాపారం చూస్తుండడంతో నాగలక్ష్మిని తొలగించి ఆమె స్థానంలో బోర్డులో డైరెక్టర్‌గా కిరణ్‌ను నియమించారు. కేవలం ఐదో తరగతి చదివిన వేణుగోపాలకృష్ణ.. గతంలో క్వాంటమ్ గొలుసుకట్టు మార్కెటింగ్, విజయవాడ జమ్మిచెట్టు వీధిలోని ఓ మార్ట్‌లో, తర్వాత బీమా కంపెనీ, ఫ్యూచర్ మేకర్ గొలుసుకట్టు మార్కెటింగ్ సంస్థల్లో పనిచేశారు. ఆ అనుభవంతోనే సంకల్పసిద్ధి ఈకార్ట్‌ను స్థాపించాడు. భార్య పిల్లలతో విడిపోయిన వేణుగోపాలకృష్ణ, లక్ష్మి అనే మహిళతో సన్నిహితంగా మెలిగాడు. ఈమెను తన భార్యగా పలువురికి పరిచయం చేశాడు. ఈమెను కూడా నిందితురాలిగా చేర్చి పోలీసులు అరెస్టు చేశారు.
ఇవీ చదవండి: