No Approach Road to Bridge on Wyra River at Damuluru: వంతెన నిర్మించడం కష్టమైన పని. కానీ, దానికి అప్రోచ్ రోడ్ వేయడం సులభం. కష్టమైన వంతెన నిర్మాణం తెలుగుదేశం ప్రభుత్వం రెండేళ్లలోనే పూర్తి చేసింది. కానీ, తేలికైన అప్రోచ్ రోడ్‌ను వైఎస్సార్సీపీ సర్కార్ నాలుగున్నరేళ్లైనా నిర్మించలేకపోతోంది. ఎన్టీఆర్ జిల్లా దాములూరు వద్ద ఏటి కష్టాలు తొలగించేందుకు నిర్మించిన వంతెన, వైఎస్సార్సీపీ సర్కార్ నిర్లక్ష్యంతో అక్కరకు రాకుండా పోతోంది.
అభివృద్ధి అంటే గిట్టని పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం. వైరా ఏటిపై అలంకార ప్రాయంగా మిగిలిన ఈ వంతెన. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, వీరులపాడు మండలాలను కలుపుతూ దాములూరు వద్ద దీన్ని నిర్మించారు. 2015లో ఈ హై - లెవెల్ వంతెన నిర్మాణానికి పునాది అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం వేసింది. 6 కోట్ల 47 లక్ష రూపాయలతో 2017లోనే దీని నిర్మాణం పూర్తి చేసింది.
రోడ్ల పనులకు నిధులివ్వక చేతులెత్తేసిన ప్రభుత్వం.. రుణాన్ని ఆపేసిన బ్యాంకు
వంతెన నిర్మాణం పూర్తైనా రెండు వైపులా అప్రోచ్ రహదారి నిర్మాణం పూర్తి కాలేదు. నాలుగున్నరేళ్లుగా దీన్ని పూర్తి చేద్దాం, ప్రజలకు అందుబాటులోకి తెద్దామనే ఆలోచనే వైఎస్సార్సీపీ సర్కార్ చేయలేదు. ప్రస్తుతం దిగువునున్న లో - లెవెల్ చప్టానే ప్రజలకు దిక్కైంది. అదీ ఇప్పుడు ధ్వంసమైంది. వర్షాలు, వరదలొస్తే రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.
"వాగులో రోడ్డు గుంతలుగా ఉంది. 2017లో పూర్తి చేశారు. వంతెనకు రెండు వైపులా రోడ్డు లేదు. వంతెన మాత్రం పూర్తి చేశారు." - స్థానికుడు
"వంతెనను కట్టి పనులు ఆపేశారు. వర్షం పడి వరదలు వస్తే సుమారు 12 కిలోమీటర్లు దూరం తిరిగి వెళ్లాలి. ఇంత దూరం తిరిగి వెళ్తున్నామంటే బాధను అర్థం చేసుకోండి. " - స్థానికుడు
పరిశ్రమలు తరలిపోవడం ప్రభుత్వ వైఫల్యం కాదా
తెలంగాణలోని మధిర నుంచి కూడా ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు, కంచికచర్ల మీదుగా విజయవాడకు ఈ మార్గంలో రాకపోకలు సాగుతుంటాయి. వీరులపాడు మండలం జమ్మవరం నుంచి నందిగామ మండలం కొణతమాత్మకూరు వరకూ 12 కిలోమీటర్ల మేర ఏడు మీటర్ల వెడల్పుతో రహదారి విస్తరణను ప్రతిపాదించారు.
ఈ వంతెన అప్రోచ్ రోడ్ నిర్మాణమూ అందులో భాగమే. దీని కోసం న్యూ డెవలప్మెంట్ బ్యాంకు రుణంతో 30 కోట్ల రూపాయల నిధులూ మంజూరు చేశారు. కానీ ఇంతవరకూ పనులే మొదలే కాలేదు. గుత్తేదారు జాప్యం చేస్తున్నా వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధుల్లో కనీస చలనం లేదని, అదే తమకు శాపమైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కలగానే పొట్టెపాళెం వంతెన నిర్మాణం - వర్షాలు కురిసినప్పుడల్లా ప్రజలకు తప్పని ఇబ్బందులు