NMUA Demands to Give old Pension Scheme to RTC Employees: ఆర్టీసీ(RTC) ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఉద్యోగ సంఘంగా ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించడంతో ఎన్ఎంయూఏ(NMUA) నేతలు విజయవాడలో విజయోత్సవ సభ నిర్వహించి ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ఈ సమావేశానికి ఎన్ఎంయూఏ సంఘం అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు సహా సంఘం నేతలు, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. పీఆర్సీ బకాయిలు పెండింగ్‌లో పెట్టడం సహా, పలు అలవెన్సులు నిలిపివేసినందుకు తాము కష్టాలు పడుతున్నట్లు పలువురు ఉద్యోగులు నేతల దృష్టికి తెచ్చారు. విలీనం వల్ల అనేక సమస్యలు వచ్చాయని, వీటిని ప్రభుత్వం పరిష్కరించకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.
ప్రభుత్వంలో విలీనం అయ్యాక నెలకొన్న సమస్యల వల్ల ఉద్యోగులు ఎదుర్కొంటోన్న సమస్యలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఎన్ఎంయూఏ సంఘానికి గుర్తింపు వచ్చాక తమకు బాధ్యత మరింత పెరిగిందని సంఘం అధ్యక్షుడు రమణారెడ్డి తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం సాధించడమే తమ లక్ష్యమన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు 2017 ఏడాది నుంచీ పీఆర్సీ బకాయిలు 550కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని.. ఎన్కాష్మెంట్ మొత్తం 300 కోట్లు చెల్లించకుండా బకాయి పెట్టాలని తెలిపారు. ఆర్టీసీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నెలకు 125 కోట్లకు పైగా ఆదాయాన్ని తీసుకుంటోందని అన్నారు.
ఆర్టీసీ ఉద్యోగులు ఓపీఎస్ అమలు చేయకపోవడం వల్ల ఆందోళన చెందుతున్నారని ఎన్ఎంయూఎ ప్రధానకార్యదర్శి వై. శ్రీనివాసరావు అన్నారు. జీతాలు రాక, అలవెన్సులు రాక విలీనం కోరుకోలేదని.. ఉద్యోగులు రిటైర్ అయ్యాక 3 వేల పెన్షన్‌తో నరక యాతన అనుభవిస్తుంటే తాళలేక, పాత పెన్షన్ విధానం కోసమే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనాన్ని కావాలని బలంగా కోరుకున్నట్లు తెలిపారు. ఈ ప్రభుత్వానికి మా ఓట్లు కావాలంటే పీటీడీ ఉద్యోగులకు OPS ఇచ్చి తీరాల్సిందేనని స్పష్టం చేశారు.
Kidnapped boy in Tirupati Found: బాలుడి అదృశ్యం కేసులో ట్విస్ట్.. సొంత బాబాయే కిడ్నాపర్..
ఆర్టీసీ డిపోలో టూల్స్, లేవు మెకానిక్‌లు లేరు, సిబ్బంది లేరు, నియామకాలు లేవని, పని ఒత్తిడితో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు స్టీరింగ్‌పై, సీట్లలో కూర్చుని ప్రాణాలు విడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేడర్ స్ట్రెంత్ అమలుతో ఉద్యోగులను బదిలీలు చేసి వేతనాల్లో కోత పెట్టారని, దీనివల్ల ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు గతంలో ఉన్నట్లుగా అపరిమిత వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నేషనల్ మజ్జూర్ యూనిటీ అసోసియేషన్‌కు వచ్చిన గుర్తింపుతో వజ్రాయుధం చేతికి వచ్చిందని, ఇక పోరాటం చేస్తామని నేతలు తెలిపారు. ఇప్పటికైనా ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటోన్న సమస్యలన్నింటినీ ప్రభుత్వం, యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని కోరారు.