NGT INSPECTS ILLEGAL MINING : వేల ఎకరాల అటవీ శాఖ భూమి .. కొందరు పట్టా తీసుకున్నారు.. మరికొందరు స్థలాలు విక్రయించారు. కొనుగోలు చేసిన వాళ్లు యథేచ్ఛగా మైనింగ్‌కు పాల్పడుతున్నారు. ఇదీ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ పరిధిలోని కొత్తూరు, తాడేపల్లి, నైనవరం గ్రామాల పరిధిలో జరుగుతున్న తీరు. నియోజక వర్గ పరిధిలో ఉన్న పోలవరం కుడి కాలవ పరిసర ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో అటవీ భూమి వేల ఎకరాల్లో ఉంది. అక్రమంగా మట్టి ,గ్రావెల్‌ను తరలిస్తున్నారని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర అనే వ్యక్తి 2023 జనవరి 10న నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేశారు.
స్పందించిన ఎన్‌జీటీ అధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. పిటిషన్ ఆధారంగా ముగ్గురు సభ్యులు గల కమిటీ అక్రమ మైనింగ్‌ను పరిశీలించేందుకు కొత్తూరు, తాడేపల్లి వచ్చింది. కమిటీతో పాటు విజయవాడ సబ్ కలెక్టర్ అతిథిసింగ్ ఉన్నారు. అటవీ ప్రాంతంలో జరుగుతున్న మైనింగ్ గురించి స్థానిక తహసీల్దార్‌ను అడిగి తెలుసుకున్నారు. నిత్యం వందల లారీలతో మట్టిని, గ్రావెల్‌ను తరలిస్తున్నట్లు స్థానికులు కమిటీకి నివేదించారు. ఎటువంటి అనుమతులు లేకుండానే యథేచ్ఛగా కోట్ల రూపాయల విలువైన గ్రావెల్‌ను తరలిస్తున్నారని ఆరోపించారు.
పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్(PCB), అటవీశాఖ ,రెవెన్యూశాఖ అధికారులు పరిశీలనకు వచ్చారు. అయితే ఇరిగేషన్ ,మైనింగ్ శాఖకు అధికారులు ఎవరూ రాలేదు. దీంతో కొన్ని అంశాల్లో స్పష్టత రాలేదని కమిటీ తెలిపింది. పోలవరం కాలువ తవ్వేందుకు తమ భూమిని ఇరిగేషన్ అధికారులకు ఇచ్చామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు కొంతమంది అటవీ భూముల్లో పట్టాలు పొందారని ..సాగు చేసుకుంటున్నారని తెలిపారు. అటవీ భూములను సాగు చేసుకునేందుకు మాత్రమే అధికారముంటుందని.. కానీ ఈ విధంగా కొల్లగొట్టేందుకు అనుమతి ఉండదని స్థానికులు చెబుతున్నారు .
అక్రమ మైనింగ్ అంశం పలు శాఖల సమన్వయంతో దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. రెండు శాఖల అధికారులు అందుబాటులో లేకపోవటంతో మైనింగ్ ఎంత జరిగింది ..ఏ భూముల్లో జరిగిందని స్పష్టత రాలేదు. దీంతో కమిటీ తిరిగి వెళ్లిపోయింది. మరోమారు పరిశీలిస్తామని అధికారులు తెలిపారు .
అప్రమత్తమైన మట్టి మాఫియా..అయితే ఇది ఇలా ఉండగా మట్టి తవ్వకాలపై విచారణకు ఎన్‌జీటీ అధికారుల బృందం వస్తున్నారనే విషయం తెలుసుకున్న మట్టి మాఫియా జాగ్రత్త పడింది. ఆదివారం రాత్రే మైనింగ్ చేసే ప్రాంతాల నుంచి లారీలు, పొక్లెయిన్లను తరలించేశారు. కనీసం ఎక్కడ నుంచి మట్టి తవ్వుతున్నారన్న విషయాన్ని తెలియకుండా జాగ్రత్తపడ్డారు. కొన్నిచోట్ల క్వారీల్లోకి వాహనాలు వెళ్లకుండా అడ్డుగా మట్టి కుప్పలు పోసి ఉంచడంతో అధికారుల బృందం వెనుదిరగాల్సి వచ్చింది. తర్వాత జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లి గ్రామాల పరిధిలో మట్టి తవ్వకాలు చూసి అధికారులు ఆశ్చర్యం పోయారు. భారీ ఎత్తున తవ్వకాలు చేపట్టడాన్ని గుర్తించారు.
విచారణపై పిటిషనర్ అసంతృప్తి: మరోవైపు విచారణ ప్రక్రియపై ఫిర్యాదుదారు సురేంద్ర బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యులైన ప్రధాన శాఖల అధికారులు గైర్హాజరయ్యారని విమర్శించారు. మరో దఫా విచారణ చేస్తామని ప్రకటించారని, ఎప్పుడు చేస్తారో మాత్రం తెలపలేదన్నారు. దాదాపుగా 400 ఎకరాల మేర తవ్వకాలు చేశారని, అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్‌జీటీలో చేసిన ఫిర్యాదుపై కొందరి నుంచి తమకు బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గలేదన్నారు.
ఇవీ చదవండి: