Nara Lokesh Fire on YSRCP: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ.. ఆయన అభిమాని, నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం చినదేవళాపురానికి చెందిన చింతల నారాయణ రాజమహేంద్రవరానికి పాదయాత్ర చేపట్టడం తెలిసిందే. కాగా, నారాయణను పాదయాత్ర విరమించుకోవాలని పలుమార్లు హెచ్చిరించిన వైసీపీ నేతలు.. గురువారం పల్నాడు జిల్లా వినుకొండ మండలం విఠంరాజుపల్లి వద్ద బైక్‌పై వచ్చి ఆయనపై దాడి చేశారు. దాడిలో గాయాలపాలైన నారాయణను స్థానిక టీడీపీ నేతలు ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చించారు.
TDP Leadership Fire on YCP Leaders: ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం భగ్గుమంది. చంద్రబాబు అభిమాని చింతల నారాయణపై దాడిని తీవ్రంగా ఖండించింది. ఇన్నాళ్లూ ప్రతిపక్ష నేతలపై దాడులు చేసిన సైకో జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు సామాన్య ప్రజలపై కూడా దాడులకు తెగబడుతోందని ఆగ్రహించింది. నారాయణ పాదయాత్ర జగన్‌కి తప్పుగా కనిపిస్తోందా..? అని నిలదీసింది. నారాయణపై దాడి చేసిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
Nara Lokesh Fire on CM Jagan: చంద్రబాబు అభిమాని నారాయణపై వైసీపీ మూకల దాడిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు.''జగన్ సైకోయిజం వైసీపీ కార్యకర్తలకీ అంటుకుంది. రాజ్యాంగ వ్యవస్థల విధ్వంసానికి పాల్పడుతూ.. ప్రశ్నించే ప్రతిపక్ష నేతల్నే కాకుండా, ప్రజల్ని కూడా హింసిస్తూ.. సైకో జగన్ అతని శాడిజాన్ని చూపిస్తున్నాడు. అధినేత చూపిన ఫ్యాక్షన్ బాటలో వైసీపీ కేడర్ పయనిస్తూ.. సామాన్యులని భయభ్రాంతులకి గురిచేస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుని నిరసిస్తూ.. శాంతియుత పోరాటం చేస్తున్న ఆయన సతీమణి భువనేశ్వరికి సంఘీభావం తెలుపుతూ.. నంద్యాల నుంచి రాజమహేంద్రవరం వరకూ పాదయాత్రగా వెళ్తోన్న నారాయణపై దాడి అమానవీయం. వృద్ధుడు అని చూడకుండా దాడి చేశారంటే వీరు ముమ్మాటికీ వైసీపీ సైకోలే'' అంటూ లోకేశ్ ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియోను ఆయన తన ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
Achchennaidu Fire on YCP Groups: అణచివేతే రాజ్య విధానంగా జగన్ పాలన సాగుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం కార్యకర్త నారాయణపై వైసీపీ రౌడీ మూక దాడి దుర్మార్గమని ఆయన దుయ్యబట్టారు. నారాయణ పాదయాత్ర ముఖ్యమంత్రి జగన్‌కి తప్పుగా కనిపిస్తోందా..? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. జగన్ చర్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయని విమర్శించారు. నారాయణపై దాడి చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
GV Anjaneyu Fire on YCP MLA Bolla: పల్నాడు జిల్లా వినుకొండలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చింతన నారాయణను.. టీడీపీ నేత జీవీ ఆంజనేయులు పరామర్శించారు. రాష్ట్రంలో వైసీపీ నేతల అరాచకాలు పెచ్చుమీరుతున్నాయని ఆగ్రహించారు. 70 ఏళ్ల వయసులో పాదయాత్ర చేస్తున్న వ్యక్తిపై దాడి చేయడమేంటి..? అని ఆంజనేయులు ప్రశ్నించారు. పాదయాత్ర చేస్తున్న చింతల నారాయణను వైసీపీ కార్యకర్తలు పలుచోట్ల బెదిరించారని గుర్తు చేశారు. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు దౌర్జన్యాలు పెరిగిపోయానని మండిపడ్డారు. తన కార్యకర్తలతో నారాయణపై బొల్లా బ్రహ్మనాయుడు దాడి చేయించారని ఆయన ఆరోపించారు. భువనేశ్వరిని పరామర్శించేందుకు వెళ్తుంటే దాడి చేస్తారా..? అని జీవీ ఆంజనేయులు నిలదీశారు. ఈ ఘటనపై పోలీసులకు చెబుదామంటే వారు ఫోన్ రిసీవ్ చేసుకోలేదని ఆయన అన్నారు.
''రోజు మాదిరిగానే ఇవాళ కూడా నా పాదయాత్రను పల్నాడు జిల్లా వినుకొండ మండలం విఠంరాజుపల్లి వద్ద ప్రారంభించాను. ఇంతలోనే ఓ నలుగురు వ్యక్తులు రెండు బైక్‌లపై నన్ను వెంబడించారు. నేను అంత పెద్దగా పట్టించుకోలేదు. అలా వెంబడిస్తూ.. వినుకొండ దాటిన తర్వాత నాపై దాడి చేశారు. నా వద్ద ఉన్న జెండాలు లాక్కున్నారు. ఫ్లెక్సీని చించేశారు. ముసలాడివని చంపకుండా వదిలేస్తున్నామని నన్ను హెచ్చరించారు.''-బాధితుడు చింతల నారాయణ, చంద్రబాబు అభిమాని