MLC Voter list: పట్టభద్రుల ఎమ్ఎల్సీ ఎన్నికల ఓటర్ తుది జాబితాలో చిత్ర విచిత్రాలు బయటికొస్తున్నాయి. ఐదో తరగతి చదివినవారినీ పట్టభద్రులుగా గుర్తించారు. కొన్నిచోట్ల వాలంటీర్ కొలువునూ విద్యార్హతగా అంగీకరించారు. మొత్తంగా వైఎస్సార్సీపీ వాలంటీర్లు చేర్చిన అనర్హులకు ఓటు హక్కు దక్కిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అర్థం పర్థం లేని పదాలు: శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం ఓటరుకు డిగ్రీ విద్యార్హత ఉండాలి. కానీ నిరక్షరాస్యులు, 5, 7, 10, ఇంటర్ విద్యార్హతలున్నవారికీ ఓటు హక్కు కల్పించేశారు. కొందరైతే తమ విద్యార్హతలుగా వీధి పేర్లు, ఊరు పేర్లు, తాము చేస్తున్న వృత్తి సహా అర్థం పర్థం లేని పదాలను పేర్కొన్నారు.
విద్యార్హతను నవ్వులపాలు: విశాఖ పరిధిలో అనేక మంది ఓటర్ల విద్యార్హతను నవ్వులపాలు చేశారు. మద్దిలపాలెం 231వ నంబర్ పోలింగ్ కేంద్రంలో ఆర్తిసింగ్ అనే ఆమె విద్యార్హతను ‘నాట్ యాక్యూరేట్’గా పేర్కొన్నారు. చంద్రంపాలెం జడ్పీ పాఠశాల పోలింగ్ కేంద్రం సీరియల్ నంబర్ 1298లో లక్ష్మణ్ దమర్‌సింగ్ అనే ఓటరు విద్యార్హతను వాలంటీరుగా పేర్కొన్నారు. ఇక నడుపూరు 204వ నంబర్ పోలింగ్ కేంద్రంలోని జెర్రిపోతుల వెంకట శివన్నారాయణ అనే ఓటరు విద్యార్హతను ‘లేట్’ అని పేర్కొన్నారు. మాదవధార జీవీఎంసీ ఉన్నత పాఠశాల పోలింగ్‌కేంద్రంజాబితాలో శ్రీనివాసరావు మొకరా అనే ఓటరు విద్యార్హతను ‘నారాయణ’ గాపేర్కొన్నారు.
బోగస్ ఓట్లు: ఇక నిరక్షరాస్యులు, 5, 9, 10 తరగతి చదివిన వారికీ ఓటు హక్కు కల్పించేశారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోని 228వ నంబర్ పోలింగ్ కేంద్రంలో వీర వెంకట గంగాధర రవి, 201వ పోలింగ్ కేంద్రం పరిధిలో చిత్రాడ మోహనరావు, 276వ పోలింగ్ కేంద్రంలోని అల్లాడ మురళీకృష్ణ, 289వ పోలింగ్ కేంద్రం పరిధిలోని అప్పలనాయుడు విద్యార్హతల కాలమ్‌లో ‘నిరక్షరాస్యులు’ అని ఉంది. ఒక్క విశాఖ జిల్లాలోనే 5 వేల 141 బోగస్ ఓట్లు గుర్తించామని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఏ.అజశర్మ తెలిపారు.
అభ్యంతరాలు: నిజానికి ఓటరు జాబితా ప్రక్రియపై విపక్షాలు ముందు నుంచే అభ్యంతరాలు లేవనెత్తాయి. ఐతే అన్నీ పరిశీలించి తుది జాబితాలో సరిదిద్దుతామని నమ్మబలికిన ఎన్నికల సంఘం అధికారులు తప్పుల తడకనే అచ్చేశారు.
జగనన్న రుణం తీర్చుకోవాలి: ఓటరు నమోదు సహా ఎన్నికల పనులు వాలంటీర్లకు అప్పగించొద్దంటూ ఆదేశాలు ఇవ్వడమేగానీ అవి పక్కాగా అమలయ్యేలా చూడలేదు. చాలా మందివెబ్‌సైట్‌లో డిగ్రీ పట్టాకు బదులుగా ఏదో ఒక పత్రాన్ని అప్‌లోడ్‌చేసేశారు. వాటినిక్షేత్రస్థాయిలో విచారించకుండానే ఓటు హక్కు కల్పించటంతో అనర్హులకు జాబితాలో చోటు లభించింది. ‘వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి పట్టభద్రుల్ని ఓటరుగా నమోదు చేయించి వైఎస్సార్సీపీ అభ్యర్థుల్ని గెలిపించి జగనన్న రుణం తీర్చుకోవాలని మంత్రులు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు వాలంటీర్లకు లక్ష్యాలు నిర్దేశించడంతో అనర్హులతో పెద్ద ఎత్తున దరఖాస్తులు చేయించారు. వాటిని పరిశీలించకుండా ఆమోదించడంతో అనర్హులకు ఓటేసే అవకాశం దక్కింది.
ఇవీ చదవండి