Minister Botsa on Teachers Transfers and Promotions: రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న బదిలీలు, పదోన్నతులకు ప్రభుత్వం అంగీకరించింది. విజయవాడలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలతో మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశమయ్యి.. ఈ ప్రక్రియకు సంబంధించి అనేక అంశాలను చర్చించారు. దాదాపు 3 గంటలకు పైగా సాగిన సమావేశంలో బదిలీలు, పదోన్నతుల విషయంలో ఉపాధ్యాయ సంఘాల చేసిన సూచనలను మంత్రి అంగీకరించారు. నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగానే ఉపాధ్యాయుల బదిలీలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
నేటి నుంచి రాష్ట్రంలో ఉపాధ్యాయులు బదిలీల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. దాదాపు 679 ఎంఈవో-2 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం నేడు జీవో విడుదల చేస్తుందన్నారు. మండల విద్యాస్థాయిలో ఈ పోస్టులు ఎంతో కీలకం కానున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 350 గ్రేడ్-2 ప్రధాన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తున్నామని చెప్పారు. 1746 పీజీ ఉపాధ్యాయుల పునర్విభజన ప్రక్రియ కూడా నేటి నుంచే ప్రారంభిస్తామన్నారు. అలాగే 9269 మంది ఎస్.జీ.టీ ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇస్తున్నామన్నారు.
ఈ విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపే బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. గతంలో పదోన్నతులు, బదిలీల విషయంలో ఉపాధ్యాయులు.. న్యాయస్థానాలను ఆశ్రయించడంతో కొంత ఇబ్బందులు వచ్చాయని గుర్తు చేశారు. ఈసారి మాత్రం ఎవరూ న్యాయస్థానాలకు వెళ్లి ప్రక్రియకు అడ్డుపడొద్దని విజ్ఞప్తి చేశారు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి చేసిన తర్వాతే పదోన్నతులు జరుగుతాయన్నారు.
బదిలీలు, పదోన్నతులు లేక ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు సాయి శ్రీనివాస్, పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరుణానిధి మూర్తి తెలిపారు. ఉపాధ్యాయులు బదిలీలు, పదోన్నతులకు సంబంధించి మంత్రి బొత్స సత్యనారాయణతో సమావేశం సానుకూలంగా జరిగిందని చెప్పారు. ప్రస్తుతం పాఠశాల అసిస్టెంట్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వాటిని పరిష్కరించాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. ఉపాధ్యాయుల పదోన్నతులకు ప్రభుత్వం అంగీకరించడం సంతోషంగా ఉందన్నారు. 2015-17 సంవత్సరాల్లో ఉన్న జీవోల్లో చిన్న మార్పులు చేసి ఉపాధ్యాయులను బదిలీలు చేస్తున్నారని వివరించారు. ఉపాధ్యాయులకు పాత స్టేషన్ పాయింట్లు ఇవ్వడానికి మంత్రి అంగీకరించారని పేర్కొన్నారు.
ఉన్నత పాఠశాలల్లో విధులు నిర్వహించిన సబ్జెక్ట్ ఉపాధ్యాయులను బదిలీల అంశంలో.. సీనియర్లుగా గుర్తించాలని ఏపీపీఈటీ, పీడీ అసోసియేషన్ కోరింది. ఎంఈవో ఖాళీలను సీనియారిటీ ప్రాతిపదికన ఇవ్వాలని విన్నవించింది. బదిలీలు, పదోన్నతుల్లో రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు అమలు చేయాలని.. మంత్రికి ఉపాధ్యాయ నేతలు సూచించారు. 9వేల 269 మంది SGT ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇస్తున్నామన్న బొత్స దాదాపు 679 ఎంఈవో-2 పోస్టుల భర్తీకి జీవో ఇస్తామని వెల్లడించారు.
ఇవీ చదవండి: