Less Compensation to Farmers for Arrange Power Lines: కరెంటు తీగలు ఆ రైతుల జీవితాల్లో కలవరం రేపుతున్నాయి. బైపాస్ రోడ్ కోసం అధికారులు చేసిన విద్యుత్ లైన్ల రీ-ఎలైన్మెంటుతో వారు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ తీగలు వెళ్లే ప్రాంతంలో భూసేకరణ నిమిత్తం కేవలం 10 శాతం పరిహారం మాత్రమే ఇస్తామని అధికారులు చెబుతుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. విజయవాడ నగర పరిధిలోకి వచ్చే కోట్ల విలువ చేసే భూముల్ని.. అధికారులు నిబంధనల పేరుతో బలవంతంగా సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారని విజయవాడ గ్రామీణ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చెన్నై-హౌరా మధ్య విస్తరించి ఉన్న 16వ నంబర్ జాతీయ రహదారికి సమాంతరంగా.. గుండుగొలను నుంచి కాజా వరకు బైపాస్ రహదారి పనులు జరుగుతున్నాయి. ఈ పనుల మూడో దశలో భాగంగా పెద్ద అవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు 30 కిలోమీటర్ల మేర రహదారిని కొత్తగా నిర్మిస్తుండగా.. 11 చోట్ల విద్యుత్ హైటెన్షన్ లైన్లు అడ్డుగా ఉన్నాయి. దీంతో అధికారులు రీ-ఎలైన్మెంట్, రీడిజైన్లు చేశారు. విద్యుత్ టవర్ల ఏర్పాటు, వైర్లు వేసేందుకు విజయవాడ గ్రామీణ పరిధిలోని నున్న, కుందావారి కండ్రిక గ్రామాల్లో సుమారుగా 100 ఎకరాల భూమి కావాల్సి ఉంది.
ప్రస్తుతం ఇక్కడ బహిరంగ మార్కెట్లో ఎకరా 5కోట్ల వరకు పలుకుతోంది. నగర ప్రాంతం, సీఆర్డీయే పరిధి కావడం, గృహావసరాలకు భూమి అనువుగా ఉండటంతో భూముల ధర కోట్లలో పలుకుతోంది. విద్యుత్ వైర్లు వెళ్లేచోట ఇక్కడ రైతులకు.. ప్రభుత్వం జీవో నంబర్ 1983 ప్రకారం రిజిస్ట్రేషన్ ధరలో కేవలం 10 శాతం మాత్రమే ఇస్తామని చెబుతుండటంతో రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ లైన్లు వెళ్లేచోట ఇళ్లు కట్టుకోవడానికి అవకాశం లేదని.. ఇక ఆ భూములపై ఆశలు వదులుకోవాల్సిందేనని అంటున్నారు.
మరోవైపు రైతులు మాత్రం విద్యుత్ తీగలు వేయాలంటే విద్యుత్ చట్టం ప్రకారం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉందని.. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ కమిటీ నుంచి అనుమతులు పొందాలని చెబుతున్నారు. రైతులకు తక్కువ నష్టం జరిగేలా ఎలైన్మెంట్లో మార్పులు చేయాలని రైతులు పలుమార్లు జిల్లా యంత్రాంగాన్ని కోరినా.. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
విద్యుత్ టవర్లు నిర్మిస్తున్న ప్రాంతంలో రిజిష్ట్రేషన్ రేట్లకు రెండున్నర రెట్లు పరిహారం ప్రకటించారని, విద్యుత్ లైన్లు వెళ్లే ప్రాంతాల్లో మాత్రం 10 శాతమే పరిహారం ఇస్తామని అధికారులు చెబుతుండటంపై రైతులు మండిపడుతున్నారు. ఖచ్చితంగా వందశాతం రిజిష్ట్రేషన్ ధర ఇవ్వాలని అధికారుల్ని డిమాండ్ చేస్తున్నారు. ఎకరా 5 కోట్లు ఉన్న విలువైన అర్బన్ ల్యాండ్స్‌కు.. గ్రామీణ ప్రాంతాలతో పోల్చి పరిహారం నిర్ణయిస్తున్నారని.. ఇది సమంజసం కాదని రైతులు అధికారుల్ని ప్రశ్నిస్తున్నారు. తగిన నష్టపరిహారం ఇచ్చిన తర్వాతే సంబంధిత పనులు చేపట్టాలని బాధిత రైతులు తేల్చి చెబుతున్నారు. దీనిపై ప్రత్యేకమైన జీవో విడుదల చేసి.. రిజిష్ట్రేషన్ రేట్ల ప్రకారం పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ భూముల్లో వ్యవసాయం చేసేందుకు వెళ్లే రైతుల్ని పోలీసులతో అడ్డుకుంటున్నారని.. వారంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు రైతులు న్యాయస్థానాలను ఆశ్రయించగా.. న్యాయం జరిగే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ భూములను అధికారులకు అప్పగించబోమని రైతులు స్పష్టం చేస్తున్నారు. పరిహారం విషయంలో నెలకొన్న చిక్కుముడిని జిల్లా అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని కోరుతున్నారు.