Pothina Mahesh Angry on Karnati Rambabu : స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు డైరెక్షన్లోనే విజయవాడ దుర్గ గుడి పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ ధ్వజమెత్తారు. రౌడీ షీటర్ అయిన దుర్గ గుడి చైర్మన్ కర్నాటి రాంబాబు కూడా అమ్మవారి ఆలయ ప్రతిష్ట గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేసారు. దుర్గ గుడి ఈఓ భ్రమరాంబని బదిలీ చేయించి కొత్త ఈఓ నియామకం ద్వారా డబ్బులు కొట్టేయాలని చూస్తున్నారని, తద్వారా అమ్మవారి ఆలయాన్ని తన చేతల్లో పెట్టుకోవాలని చూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమకు అనుకూలమైన వారికి కాంట్రాక్టులు ఇప్పించుకొని తద్వారా కమిషన్లు కొట్టేయాలనే ఉద్దేశ్యంతో సీఎం జగన్‌కి చేసిన ఫిర్యాదులో దాగి ఉందని పోతిన మహేష్ ఆరోపించారు. ఆలయ అభివృద్ధి కోసం కేటాయిస్తామన్న 70 కోట్ల రూపాయల గురించి సీఎంని ఎందుకు డిమాండ్ చేయలేదని ప్రశ్నించారు. అంతరాలయ దర్శనం టికెట్ 500 నుంచి 300 రూపాయలు తగ్గింపుపై స్పందించరేమని నిలదీశారు. మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందని ఆయన ఆరోపించారు.
"కర్నాటి రాంబాబు చైర్మన్ పదవి తీసుకున్నప్పటి నుంచి ఆలయాలన్నీ అభివృద్ధి చేసేలా ఆరాట పడుతున్నారు. ఆలయ ఈఓ, ఉద్యోగస్తులపై సీఎంకి ఫిర్యాదు చేయాల్సిందే కానీ అభివృద్ధికి కేటాయిస్తున్న 70 కోట్ల నిధుల గురించి ఎందుకు మాట్లాడలేదు."- పోతిన మహేష్, జనసేన అధికార ప్రతినిధి
దుర్గ గుడి ఈఓపై సీఎంకు పాలకమండలి చైర్మన్ ఫిర్యాదు : విజయవాడలోని పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాలులో కార్యక్రమానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి జగన్ శుక్రవారం హాజరయ్యారు. ఆ సమయంలో దుర్గ గుడి చైర్మన్ కర్నాటి రాంబాబు వెళ్లి ఆయనను కలిశారు. అనంతరం దుర్గగుడి ఈఓ భ్రమరాంబపై ఫిర్యాదు చేశారు. దుర్గగుడి ఆలయంలో అవినీతికి పాల్పడుతున్న సిబ్బందికి ఈఓ భ్రమరాంబ కొమ్ము కాస్తున్నారంటూ పాలకమండలి ఛైర్మన్, సభ్యులు గురువారం తీవ్ర విమర్శలు చేశారు.
సీఎం జగన్ కూడా కలిసి అవే విషయాలను వివరించినట్టు తెలిసింది. ప్రధానంగా అవినీతికి పాల్పడి ఏసీబీ దాడుల్లో దొరికి.. అరెస్టు అయిన వాసా నగేష్ గురించి అన్నీ తెలిసే ఈఓ భ్రమరాంబ ప్రోత్సహించారనేది ముఖ్యమంత్రి దృష్టికి ఆయన తీసుకెళ్లారు. దీనివల్ల ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగిందనీ, ఈఓ అవినీతిపైనా విచారణ చేపట్టాలని సీఎంను కోరినట్టు సమాచారం. ఆలయంలో అవినీతి జరుగుతోందని తాము వచ్చినప్పటి నుంచి ఆధారాలతో సహా ఈఓ దృష్టికి తీసుకెళ్తున్నా బ్రమరాంబ పట్టించుకోకపోగా తిరిగి అలాంటి వారికే అదనపు బాధ్యతలు ఇస్తున్నారని వివరించినట్టు తెలిసింది. పాలకమండలి ఛైర్మన్, సభ్యులు బాధ్యతలు చేపట్టిన ఈ 3 నెలల్లోనే కనకదుర్గ ఆలయంలో అనేక అవకతవకలు గుర్తించామనీ, నియామకాలు, టెండర్ల కోసం కొందరు భారీగా వసూళ్లు చేస్తున్నారని, ఆలయ అభివృద్ధి పేరుతో అమ్మవారి ఆదాయాన్ని పక్కదారి పట్టిస్తున్నారన్నారు. ఈ విషయాలను రాత పూర్వకంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఇవీ చదవండి