PATTABHI TO RAJAMAHENDRAVARAM SUB JAIL : పోలీసుల అభ్యర్ధన మేరకు తెలుగుదేశం నేతల్ని గన్నవరం సబ్ జైలు నుంచి రాజమండ్రి కేంద్ర కార్యాలయానికి తరలించేందుకు న్యాయస్థానం అనుమతించింది. దీంతో బుధవారం సాయంత్రం టీడీపీ నేతలను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. అంతకుముందు న్యాయస్థానం ఆదేశాల మేరకు పట్టాభి సహా ఇతర తెలుగుదేశం నేతలను గన్నవరం సబ్‌జైలుకు తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది. గన్నవరం సబ్‌జైలులో ఖాళీలేని పరిస్థితులు ఇతర ఇబ్బందుల దృష్ట్యా తెలుగుదేశం నేతలను వేరొక జైలుకు తరలించాలని పోలీసులు కోర్టును అభ్యర్ధించారు.
పోలీసుల తాజా అభ్యర్థనను విచారించి.. అందుకనుగుణంగా న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం రాత్రి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పట్టాభికి వైద్యపరీక్షలు చేయించిన పోలీసులు.. తమ కస్టడిలోనే ఉంచుకున్నారు. వైద్యపరీక్షలు పూర్తయ్యేసరికి కోర్టు సమయం ముగియడంతో బుధవారం ఉదయం తిరిగి గన్నవరం అదనపు జూనియర్ సివిల్‌జడ్జి కోర్టులో పట్టాభిని హాజరుపరిచారు. వైద్య నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి పట్టాభిని గన్నవరం సబ్‌జైలుకు పంపాలని ఆదేశించారు. తనపై పోలీసులు థర్డ్‌డిగ్రీ ప్రయోగించారని మంగళవారం న్యాయమూర్తికి పట్టాభి వివరించడంతో వైద్య పరీక్షలు చేయించాలని న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే.
బుధవారం వైద్య నివేదిక పరిశీలించాక గన్నవరం సబ్ జైలుకు పట్టాభిని తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. శాంతి భద్రతల దృష్ట్యా వేరే జైలుకు తరలించాలని పోలీసులు న్యాయమూర్తిని కోరగా, ఆ అభ్యర్ధనను న్యాయస్థానం తిరస్కరించింది. ముందస్తు అనుమతి కోరితే పరిశీలిస్తానని న్యాయమూర్తి తెలిపారు. పోలీసులు అందుకనుగుణంగా ప్రత్యేక అభ్యర్థనను న్యాయమూర్తి ముందు పెట్టారు. మార్చి 7వ తేదీ వరకూ మంగళవారమే పట్టాభి సహా మొత్తం 14మంది తెలుగుదేశం నేతలకు న్యాయస్థానం రిమాండ్ విధించింది
అసలేం జరిగింది: ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వైఎస్సార్సీపీ నాయకులు, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలపై నిరసన తెలిపేందుకు టీడీపీ నేత పట్టాభి సోమవారం సాయంత్రం గన్నవరం వెళ్లగా.. అతడిని పోలీసులు అడ్డుకున్నారు. పట్టాభిపై హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద రెండు కేసులు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం వివిధ ప్రాంతాల్లో తిప్పి సోమవారం రాత్రి తోట్లవల్లూరు పోలీసుస్టేషన్‌కి పట్టాభిని తీసుకొచ్చారు. అదుపులోకి తీసుకున్న చాలా గంటల తర్వాత మంగళవారం సాయంత్రం గన్నవరం అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో హాజరుపరిచారు. గన్నవరం సీఐ కనకారావును పట్టాభి సహా 11 మంది టీడీపీ నాయకులు హత్య చేసేందుకు ప్రయత్నించారని, తనని కులం పేరుతో దూషించారని రిమాండు రిపోర్టులో పేర్కొని, వారికి జ్యుడిషియల్ రిమాండు విధించాలని జడ్జ్‌ను కోరారు.
అయితే పోలీసులు తనను కొట్టారంటూ పట్టాభి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న జడ్జ్ శిరీష.. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో పట్టాభికి వైద్య పరీక్షలు చేయించి ఆ తర్వాత తన ఎదుట హాజరు పరచాలని పోలీసులను ఆదేశించారు. అనంతరం పట్టాభి సహా మిగతా నిందితులు అందరికీ వచ్చే నెల మార్చి 7వ తేదీ వరకు రిమాండు విధించారు. నిన్న రాత్రి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్యపరీక్షల అనంతరం.. ఈరోజు ఉదయం న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా గన్నవరం సబ్‌జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇవీ చదవండి: