Farmers Grain Selling Problems : పంట పండించటం కన్నా దాన్ని అమ్ముకునేందుకే రైతులు ఎక్కువ శ్రమించాల్సి వస్తోంది. మిల్లర్లు చెప్పిన ధరకే విక్రయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దిగుమతి కూలీ, బాడుగ, వెయింటింగ్ ఛార్జీలు పోను రైతు చేతిలో ఏమీ మిగలడం లేదు. పైగా తేమశాతం పేరిట మిల్లర్లు క్వింటాకు 400 నుంచి 500 రూపాయల వరకు కోత విధిస్తున్నారు. ఆర్బీకేల ద్వారా రైతు పొలం వద్దే ధాన్యం కొంటామని ప్రకటించిన ప్రభుత్వం.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల్లో ముందస్తు రిజిస్ట్రేషన్, కూపన్లు, గోనె సంచుల కొరతతో రైతులు విసిగిపోతున్నారు. ప్రభుత్వమే ధాన్యం కొనుగోళ్లు జరపాలంటూ కృష్ణా జిల్లా పామర్రు మండలం పెద్దమద్దాలిలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. ధాన్యాన్ని రోడ్డుపై పొసి తమను అదుకోవాలని వేడుకున్నారు.
"నేను ఐదు ఎకరాలు మా బంధువుల భూమి సాగు చేసాను. మిల్లుకు తరలించి అమ్మగా.. మిల్లర్లు క్వింటాకు నాలుగు వందల రూపాయల కోత విధించారు. అదేకాకుండా రైతులు ధాన్యం కొనుగోలు సమయంలో మిల్లుకు రాకూడదని మిల్లర్లు చెబుతున్నారు. మేము రాకుండా మేము పండించిన ధాన్యాన్ని ఎలా అమ్ముకుంటాం." - రైతు
కృష్ణా జిల్లాలో ఇప్పటికీ చాలాచోట్ల ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. గోనె సంచుల కోసం రైతులు ఆర్బీకేల చుట్టూ తిరుగుతున్నారు. ఖరీఫ్‌లోనే ధాన్యం అమ్ముకోలేక ఇబ్బందిపడుతున్న రైతులు.. రబీపంట వేసేందుకు వెనకంజ వేస్తున్నారు. ఎకరాకు 36 బస్తాలు మాత్రమే కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పడంపైనా రైతులు మండిపడుతున్నారు. పంట కొనుగోలు చేస్తున్న మిల్లర్లు.. ధరమాత్రం 10రోజుల తర్వాత చెబుతామనడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికారులు మాత్రం ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతున్నారు.
"నేను గుడివాడ మిల్లుకు ధాన్యాన్ని లారీలో తరలించాను. మిల్లర్లు 20వేల రూపాయలు చెల్లిస్తేగానీ లోడు దించేది లేదని అన్నారు. నగదు చెల్లించటంతో లోడు దించారు. నగదు చెల్లించిన దానికి కనీసం రశీదు కూడా ఇవ్వలేదు. రశీదు గురించి ప్రశ్నిస్తే కనీసం సమాధానం ఇవ్వలేదు." -కృష్ణా డెల్టా రైతు.
"ఆర్బీకేలో ఇప్పటికి మూడు వేల గన్నీ సంచులు ఉన్నాయి. ధాన్యం దిగుమతి కోసం స్థానిక మిల్లులు అందుబాటులో ఉన్నాయి. ధాన్యాన్ని తరలించటానికి వాహనాలు సిద్ధంగా ఉన్నాయి. రైతులు వారి వాహనాలు కేటాయించుకున్న వారి ఖాతాలలో రవాణా ఖర్చులు జమ చేస్తున్నాము." -శ్రీధర్, పౌరసరఫరాలశాఖ అధికారి
ఇవీ చదవండి: