Drinking Water Problem : ఎన్టీఆర్ జిల్లా నందిగామ పురపాలక సంఘం పరిధిలో తాగునీటి సమస్యతో ప్రజలు అలమటిస్తున్నారు. వేసవి కాలం ప్రారంభంలోనే నందిగామ పట్టణంలో వారం, పది రోజులకు ఒకసారి కూడా తాగునీరు సరఫరా కాని దుస్థితి నెలకొంది. దీంతో పట్టణ ప్రజలతోపాటు శివారు గ్రామాలైన హనుమంతుపాలెం, అనాసాగరం గ్రామాలకు చెందిన ప్రజలు తాగునీరు కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పదిరోజులకు ఒకసారి : నగర పంచాయతీ పరిధిలో 50 వేల జనాభా ఉన్నా అధికారులు పూర్తిస్థాయిలో తాగునీరు సరఫరా చేయటంపై దృష్టి సారించడం లేదు. వర్షాకాలంలో మునేరుకు వరదలు వచ్చి పాత మునేర్ స్కీము దెబ్బతిన్నా నేటి వరకు దానికి మరమ్మతులు చేయించి తిరిగి అందుబాటులోకి తీసుకురాలేదు. దీంతోపాటు కేసర, కృష్ణానది నీరు ఆరకొరగానే సరఫరా అవుతుంది. గత కొన్ని రోజులుగా నందిగామలో రహదారుల విస్తరణ జరుగుతుండటంతో విద్యుత్ లైన్లు మార్పిడి కోసం తరచూ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. దీనివల్ల తాగునీటి సమస్య నెలకొంటుంది. ఈ పరిస్థితుల్లో తాగునీటి కోసం ప్రజలు రక్షిత మంచినీటి ట్యాంకుల వద్ద ఉన్న కుళాయిల వద్ద బారులు తీరుతున్నారు. పట్నంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి రక్షిత మంచినీటి ట్యాంకుల వద్ద ఉన్న కుళాయిల వద్దకు ప్లాస్టిక్ క్యాన్లు తీసుకొచ్చుకొని తాగునీరు పట్టుకుంటున్నారు.
తాగునీరు పట్టుకునేందుకు గంటలు తరబడి క్యూలైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కొంతమంది మినరల్ వాటర్ క్యాన్లు తీసుకుని దాహార్తి తీర్చుకుంటున్నారు. దీనిపై పట్టణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో కుళాయి కనెక్షన్ ఉన్నప్పటికీ త్రాగునీరు పది రోజులకు ఒకసారి కూడా సరఫరా చేయకపోవడం వల్ల వాటర్ క్యాన్ తీసుకొని ఇక్కడికి రావాల్సి వచ్చిందని వాపోతున్నారు. శాశ్వత రక్షిత మంచినీటి పథకం పనులు ముందుకు సాగడం లేదు.
ముందుకు సాగని శాశ్విత మంచినీటి సరఫరా పథకం : గత టీడీపీ ప్రభుత్వంలో కృష్ణానది నుంచి నందిగామకు తాగునీరు సరఫరా చేసేందుకు శాశ్వత మంచినీటి సరఫరా పథకంకు 86 కోట్ల రూపాయలు ఆసియా మౌలిక వనరుల అభివృద్ధి బ్యాంకు నుంచి మంజూరు చేశారు ఈ పనులకు అప్పట్లోనే శంకుస్థాపన చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ అధికారులకు వచ్చాక ఈ పనులకు టెండర్లు రద్దుచేసి తిరిగి టెండర్లు పిలిచింది. తిరిగి వైఎస్సార్సీపీ ప్రభుత్వం శంకుస్థాపన చేసిన నేటి వరకు పనుల్లో పురోగతి కనిపించట్లేదు. ఈ పరిస్థితుల్లో ఈ పథకం నిర్మాణ పనులు ఎప్పటికి ప్రారంభమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో నందిగామ ప్రజలకు తాగునీటి కోసం తిప్పలు తప్పట్లేదు. ఇప్పటికైనా నందిగామలో రక్షిత మంచినీటి సరఫరాపై ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చదవండి