Central Government Inquiry into Diversion of Finance Commission Funds : గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పంచాయతీలకు కేటాయిస్తున్న ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లిస్తోందన్న ఫిర్యాదులపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. వాస్తవాలు తెలుసుకునేందుకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ (Ministry of Central Panchayat Raj) డిప్యూటీ సెక్రటరీ విజయకుమార్ ఈ నెల 26, 27 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు.
Central Govt Investigation on Diversion of Funds in AP : పంచాయతీలకు కేటాయిస్తున్న ఆర్థిక సంఘం నిధులను జగన్ ప్రభుత్వం సొంత అవసరాలకు మళ్లించడంపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం కాగా నిగ్గు తేల్చేందుకు కేంద్రం సిద్ధమైంది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ విజయ కుమార్ కృష్ణా, గుంటూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని పలు పంచాయతీలను సందర్శించి నిధుల కేటాయింపు, వ్యయం తదితర అంశాలపై ఆరా తీయనున్నారు.
సర్పంచులకు షాక్.. నిధులు కాజేసిన రాష్ట్ర ప్రభుత్వం
AP PR Chamber Filed Complaint Against the State Government : రాష్ట్రానికి కేటాయించిన 14, 15 ఆర్థిక సంఘం నిధుల్లో 8 వేల 660 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించిందని ఏపీ పీఆర్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి, ఏపీ సర్పంచుల సంఘం అధ్యక్షురాలు లక్ష్మీ ముత్యాలరావు, ఇతర ప్రతినిధుల బృందం గత నెల దిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల పాటు దిల్లీలోనే ఉండి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సెక్రటరీ రాష్ట్ర పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
రాష్ట్రంలో క్షేత్ర స్థాయి పరిశీలనకు కొన్ని పంచాయతీల పేర్లు సూచించాలని డిప్యూటీ సెక్రటరీ తమకు ఫోన్ చేశారని పీఆర్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ మేరకు కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలంలోని పెదయాదర, కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లు, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, ఏలూరు జిల్లా కలిదిండి మండలంలోని కోరుకొల్లు, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలోని వంగిపురం పంచాయతీల పేర్లు సూచించామని వెల్లడించారు.
పంచాయతీ ఖాతాలు ఖాళీ.. ఏకగ్రీవ నిధులూ విద్యుత్తు ఛార్జీలకే!
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ నుంచి సైతం కొన్ని పంచాయతీల పేర్లను డిప్యూటీ సెక్రటరీ తెప్పించుకున్నట్లు తెలిసింది. మంగళవారం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో, బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లాకు వెళ్లనున్నారని తెలుస్తోంది. ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు విడుదల చేసిందా? లేదా? అనేది సర్పంచులు, కార్యదర్శులను అడిగి తెలుసుకోనున్నారు. నిధుల వ్యయంపై ప్రజల అభిప్రాయాలూ సేకరిస్తారు.
డిప్యూటీ సెక్రటరీ పర్యటన వివరాలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడే సర్పంచులకు సంబంధించి పంచాయతీల పేర్లను డిప్యూటీ సెక్రటరీకి పంపారని తెలుస్తోంది.
AP Sarpanches Meeting: 'నిధులివ్వకుంటే.. ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడిస్తాం..'