CAG Report: రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటును కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్-కాగ్ తప్పుపట్టింది. రాజ్యాంగేతర వ్యవస్థగా... గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. అలాగే.. 2019 మే నుంచి రాజధాని అమరావతి అభివృద్ధిలో అనిశ్చితి నెలకొందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి కాగ్ ఆడిట్ నివేదికల్ని సమర్పించింది. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును కాగ్ తప్పుపట్టింది. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.
ఎన్నికైన ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం లేకుండా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటును కాగ్ తప్పుపట్టింది. వార్డు కమిటీలను ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం వికేంద్రీకరణ పాలన కోసం గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసిందని... ఆడిట్ నివేదికలో కాగ్ పేర్కొంది. 2019 జులైలో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిందని స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం... స్థానిక స్వపరిపాలనను దెబ్బతీయడమేనని కాగ్ తేల్చిచెప్పింది. స్వపరిపాలన సాధించేందుకు ప్రజాప్రతినిధులతో కూడిన వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించింది.
ఏపీ పద్దు హద్దు దాటుతోంది..! పరిమితికి మించి బడ్జెట్ లో చూపని అదనపు రుణాలు : కాగ్ నివేదిక
2019 ఫిబ్రవరి నుంచి రాష్ట్ర రాజధాని అమరావతికి బడ్జెట్ తోడ్పాటును అందించలేదని కాగ్... తన ఆడిట్ నివేదికలో వెల్లడించింది. నగర అభివృద్ధికి నిధులు సమకూర్చేందుకు మార్కెట్ నుంచి రుణాల సేకరణే ప్రధాన వనరుగా నిర్ణయించారని కాగ్ తెలిపింది. అమరావతి అభివృద్ధి కోసం 33 వేల 476 కోట్ల రూపాయల సమీకరణ లక్ష్యంగా పెట్టుకున్నా... ఏపీ సీఆర్డీఏ APCRDA 8540 కోట్లు మాత్రమే అప్పు చేసిందని వివరించింది. రాజధాని నగర అభివృద్ధిపై విధానపరమైన మార్పు కారణంగా... 2019 మే నుంచి అభివృద్ధి ప్రణాళికలో అనిశ్చితి నెలకొందని కాగ్ పేర్కొంది. నిర్మాణ ప్రణాళికల్లో భాగంగా... 55 ప్యాకేజీలను పూర్తి చేసేందుకు 28 వేల 47 కోట్లు అవసరమని... కాగ్ తెలిపింది. అమరావతిలో భూసమీకరణ కోసం 2244 కోట్లు ఖర్చు చేసినా... సమీకరించిన భూమి అభివృద్ధి లేకుండా నిరుపయోగంగా ఉందని కాగ్ పేర్కొంది. ఫలితంగా భూసమీకరణ పథకం లక్ష్యం నెరవేరలేదని... కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(Comptroller and Auditor General)-కాగ్... తన ఆడిట్ నివేదికలో స్పష్టం చేసింది.
ప్రభుత్వ లెక్కలన్నీ.. అసత్యాలు, అర్ధ సత్యాలే: యనమల రామకృష్ణుడు