PVN Madhav on outsourcing employees: జగన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వల్ల 2.40 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వీధిన పడబోతున్నారని బీజేపీ శాసనమండలి పక్ష నేత పీవీఎన్ మాధవ్ అన్నారు. పదేళ్లలోపు సర్వీసు ఉన్న వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చిందని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ అమలు మాట దేవుడెరుగు... ఉన్నకాంట్రాక్ట్ ఉద్యోగులను పీకేసేందుకు కంకణం కట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుట్టుచప్పుడు కాకుండా కుట్రపూరిత ఆదేశాలను జారీ చేసిందని విమర్శించారు. నవంబర్ 28వ తేదీనే ప్రభుత్వం అన్ని శాఖలకు ఉత్తర్వులు పంపినట్లు సమాచారం అందుతోందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా అధికారులు కసరత్తు ప్రారంభించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చిందని మాధవ్ తెలిపారు.
ఏ రోజైనా తమ ఉద్యోగం క్రమబద్ధీకరణ అవుతుందని ఎదురుచూస్తున్న వారిని తీవ్ర నిరాశకు గురి చేశారని వెల్లడించారు. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల కష్టాలు తీరుస్తామని జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. 'సమాన పనికి-సమాన వేతనం' ప్రాతిపదికన న్యాయం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విషయాన్ని మాధవ్ ప్రస్తావించారు. గత ప్రభుత్వం కాలంలో సమైక్య రాష్ట్ర విభజన తర్వాత 2014-19 మధ్యలో 90 వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా నియమితులయ్యారని వెల్లడించారు.
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రిక్రూట్మెంట్ కోసం ఏకంగా 'ఆప్కాస్' అనే వ్యవస్థను తీసుకొచ్చిందని అన్నారు. తద్వారా రాష్ట్ర కేంద్రంతోపాటు జిల్లాలో కూడా నియామకాలు చేసిందని మాధవ్ పేర్కొన్నారు. తాజా ఉత్తర్వులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు శరాఘాతంగా మారాయన్నారు. వైకానా అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ఉన్న ఉద్యోగులను తొలగించేందుకు ప్రయత్నిస్తుండటం తగదన్నారు. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో జోక్యం చేసుకుని ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి అమలు చేయాలని మాధవ్ డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: