Tidco houses Facing New Difficult: రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో గత ప్రభుత్వం 300 చదరపు అడుగులు, 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో పేదలకు 3.10 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. 365 చదరపు విస్తీర్ణం ఉన్న టిడ్కో ఇళ్లకు 3 లక్షల15 వేలు, 430 చదరపు విస్తీర్ణం ఉన్న ఇళ్లకు 3 లక్షల 65వేలు రుణంగా బ్యాంకుల నుంచి అధికారులు సమీకరించాలి. గత ప్రభుత్వం రుణ సమీకరణ చేసి నిర్మాణాలు పూర్తి చేసి అప్పగిస్తామని చెప్పింది.
అప్పట్లో బ్యాంకర్లు కూడా అందుకు సమ్మతించారు. కానీ వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టాక టిడ్కో ఇళ్లను పక్కనపెట్టడం, ఆర్థిక పరిస్థితి ప్రభావంతో ఇప్పుడు వెనకడుగు వేస్తున్నాయి. ప్రభుత్వం మొదటి విడతగా అందించనున్న 1.40 లక్షల ఇళ్లలో 30 వేల మందికి రుణాలిచ్చేందుకు బ్యాంకులు సమ్మతించడం లేదు. సిబిల్ స్కోరు, వయసు ఎక్కువ అనే కారణాలు చూపి ఇవ్వడం లేదు. ప్రభుత్వం, పురపాలక శాఖ అధికారులు చర్చలు జరుపుతున్నా ఫలితం లేదు.
మొదటి విడతగా 1.40 లక్షల ఇళ్లను ఈ ఏడాది డిసెంబరు నాటికి అప్పగించాలని నిర్ణయించగా, ఇప్పటివరకు 40 వేల ఇళ్లను అప్పగించింది. బ్యాంకులు రుణాలిచ్చిన వారి పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించి లబ్ధిదారులకు ఇస్తున్నారు. ఇంకో 20 వేల గృహాల వరకు లబ్ధిదారులకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నా, బ్యాంకులు రుణాలివ్వని కారణంగా అధికారులు పెండింగ్ పెడుతున్నారు. అప్పులివ్వలేమని ప్రైవేటు బ్యాంకులు తెగేసి చెబుతున్నాయి.
మొత్తంగా 1.40 లక్షల మంది లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల నుంచి 2 వేల 700 కోట్ల వరకు టిడ్కోకు రుణాలు అందాల్సి ఉంది. ఇందులో 12 వందల కోట్ల వరకు లబ్ధిదారుల పేరిట రుణాలిచ్చాయి. ఇందులో ప్రైవేటు బ్యాంకుల వాటా 2 కోట్లు మాత్రమే. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 500 కోట్ల వరకు లబ్ధిదారుల పేరిట రుణాలు ఇచ్చేందుకు ముందుకొచ్చిన ప్రైవేటు బ్యాంకులు.. ప్రస్తుతం ససేమిరా అంటున్నాయి.
బ్యాంకుల అప్పులిచ్చేందుకు వెనకడుగు వేస్తుండటంతో లబ్ధిదారులే ఆ రుణ మొత్తాన్ని నాలుగు విడతల్లో చెల్లించేలా పురపాలకశాఖ ప్రత్యేక ఆదేశాలిచ్చింది. ఇది స్వచ్ఛందమే అని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ మేరకు దాదాపు 500 మంది ఇప్పటికే 6 కోట్ల మేర టిడ్కోకు చెల్లించారు. మరోవైపు 300 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న గృహాలను ప్రభుత్వం లబ్ధిదారులకు ఉచితంగా ఇస్తున్నందున వీటికి రుణ సమీకరణ బెడద లేదు. దీంతో తమకు కూడా 300 చదరపు విస్తీర్ణం ఉన్న ఇళ్లనే ఇవ్వాలని కొంతమంది అధికారుల్ని కోరుతున్నారు.
ఇవీ చదవండి: