POLAVARAM PROJECT: పోలవరం నిధులకు కేంద్రం కొర్రీ వేసి రెండేళ్లు దాటింది. ఈ కొర్రీల నుంచి ప్రాజెక్టును బయటపడేసి అవసరమైన మేర నిధులు సమకూర్చుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు సఫలం కాలేదు. రాజకీయంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేసి సాధించాలే తప్ప ఇందులో తాము చేయగలిగేదేమీ లేదని కొందరు జలవనరులశాఖ అధికారులు చెబుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రి దిల్లీ వెళ్లి ప్రధానిని కలిసిన ప్రతి సందర్భంలోనూ పోలవరం నిధులు అడిగామని అంటున్నారు. 55 వేల 656 కోట్ల డీపీఆర్‌ను ఆమోదించాలని ప్రధానికి విన్నవిస్తున్నామని వివరిస్తున్నారు. ప్రధాని మోదీతో తనకు రాజకీయాలకు అతీతమైన అలౌకిక సంబంధం ఉందని జగన్ బహిరంగంగానే ప్రకటించారు. రాజ్యసభలో వైకాపాకు ఉన్న బలం కేంద్ర ప్రభుత్వానికి కీలకమైన అనేక సందర్భాలున్నాయి. 25 మంది ఎంపీలను ఇవ్వండి... దిల్లీలో ఏం సాధించాలో అవన్నీ సాధించుకువస్తానని జగన్ పాదయాత్రలో పదేపదే వల్లె వేశారు. ఆ పార్టీకి ఎన్నికల్లో 22 మంది లోక్‌సభ సభ్యుల బలాన్ని ప్రజలు కట్టబెట్టారు. ఈ రాజకీయ బలం, అలౌకిక సంబంధంతో దిల్లీ స్థాయి పనులు సాధించిందీ పెద్దగా ఏమీ లేదు.
జగన్ ప్రభుత్వం విఫలం: కేంద్ర జల్‌శక్తి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన అంచనాల సవరణ కమిటీ పోలవరం సాగునీటి విభాగానికయ్యే ఖర్చును మదించింది. 2014 ఏప్రిల్1 నాటికి 2013-14 ధరల ప్రకారం ఖర్చును 20 వేల 398.61 కోట్ల రూపాయలుగా అంచనా వేసింది. అంతే మొత్తానికి కేంద్ర జల్‌శక్తి మంత్రి ఆమోదమూ లభించింది. ఈ గడువుకు ముందు కేంద్రం నీటిపారుదల విభాగానికి అయిన ఖర్చు కింద 4 వేల 730 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇక మిగిలింది 15 వేల 667 కోట్లు. అందులో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక 8వేల 614.16 కోట్లు ఇవ్వడంతో... ఇక పోలవరానికి కేంద్రం 7 వేల 53.74 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అంకెలను ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ ఖరారు చేయాలని... కేంద్ర ఆర్థికశాఖ ఉప కార్యదర్శి ఎల్ కే త్రివేది కేంద్ర జల్‌శక్తి కార్యదర్శికి 2020 అక్టోబరు 12న లేఖ రాశారు. ఇది ప్రాజెక్టు నిధులకు పెద్ద అడ్డంకిగా నిలిచింది. 2014 ఏప్రిల్1 తరువాత కేంద్రం రాష్ట్రానికి 13 వేల 98.57 కోట్లు తిరిగి చెల్లించింది. దీంతో ఇక కేంద్రం నుంచి రావాల్సిన మొత్తం 2 వేల 500 కోట్లు మాత్రమే. ప్రాజెక్టు పూర్తికి మరో 25 వేల 208 కోట్ల రూపాయలు అవసరమవుతాయని రాష్ట్రం అంచనా వేసింది. డయాఫ్రం వాల్ ధ్వంసం కావడం, ప్రధానడ్యాం వద్ద ఏర్పడ్డ నదీగర్భం ఇసుక కోతను సరిచేసే వ్యయాన్ని కూడా దీనికి కలపాల్సి ఉంది. అలాంటిది రెండేళ్లుగా డీపీఆర్-2 ఆమోదించుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలమవుతూనే ఉంది.
కొత్త డీపీఆర్ ఆమోదం: కేంద్ర ఆర్థికశాఖ కొర్రీతో పోలవరం డీపీఆర్-2కు మళ్లీ ఇబ్బందులు ఎదురయ్యాయి. కేంద్ర ఆర్థికశాఖ అడ్డంకి చెప్పేనాటికి 2017-18 ధరలతో పోలవరం డీపీఆర్-2... 55 వేల 656 కోట్ల రూపాయలకు కేంద్ర సాంకేతిక కమిటీ ఆమోదించింది. ఆ తర్వాత రివైజ్డ్‌కాస్ట్ కమిటీ 47 వేల 725.74 కోట్లకు ఆమోదం తెలిపింది. ఆ డీపీఆర్ కేంద్ర ఆర్థిక శాఖ వద్ద ఆమోదం పొందితే సరిపోయేది. అలాంటిది 2013-14 ధరలనే పరిగణనలోకి తీసుకుంటామన్న కేంద్ర ఆర్థికశాఖ లేఖతో ఏర్పడ్డ ఇబ్బందులు పరిష్కారం కాలేదు. ఆ తర్వాత పోలవరం అథారిటీ సమావేశం 2020 నవంబరులో నిర్వహించారు. కొత్త డీపీఆర్ ఆమోదించకపోతే ప్రాజెక్టు పూర్తి కష్టమేనని జలవనరుల అధికారులు ఈ సమావేశంలో తేల్చిచెప్పారు. 20 వేల 398 కోట్ల రూపాయల డీపీఆర్‌కు ఆమోదం తెలియజేస్తూ ప్రాజెక్టు పూర్తికి 2017-18 ధరలతో నిధులివ్వాలని కోరారు. వీటిని కేంద్ర రివైజ్డ్‌కాస్ట్ కమిటీ ఆమోదించాక కూడా ఇది మళ్లీ అథారిటీ ఆమోదానికి వచ్చింది. వారు పలు సందేహాలు లేవనెత్తుతూ రాష్ట్ర జలవనరులశాఖ అధికారులకు తిప్పి పంపుతూనే ఉన్నారు. తాజాగా పోలవరం అథారిటీ లేవనెత్తిన అనుమానాలకు సమాధానాలు పంపారు.
నిధులివ్వాలని సిఫార్సు: ప్రాజెక్టుకు ఇంతవరకు రాష్ట్రం వెచ్చించిన నిధుల్లో 2 వేల 873 కోట్లు కేంద్రం రీయింబర్సు చేయాలి. అయితే రెండేళ్ల కిందటి ఆర్థికశాఖ కొర్రీల నేపథ్యంలో ఈ నిధులివ్వడం లేదు. పోలవరం తొలి దశకు 10వేల కోట్ల రూపాయలు కావాలని రాష్ట్రం అభ్యర్థించింది. దీంతోపాటు గతంలో తాగునీటి విభాగం కింద మినహాయించిన 4 వేల 68 కోట్లూ ఇవ్వాలని రాష్ట్రం కోరుతోంది. కేంద్ర జల్‌శక్తి సంఘం ఛైర్మన్ కూడా జాతీయ ప్రాజెక్టుల్లో తాగునీటి విభాగాన్ని విడిగా చూడటం లేదని.., ఆ నిధులివ్వాలని సిఫార్సు చేశారు. తొలిదశ 10వేల కోట్ల రూపాయలు ఆమోదించే క్రమంలో... డయాఫ్రంవాల్, నదీగర్భం కోత సమస్యల పరిష్కారం తదితరాలకు ఎంత ఖర్చవుతుందో అంచనా వేయాలని... కేంద్ర జల్‌శక్తి శాఖ సూచించింది. ఆ లెక్కలు తేలేసరికి ఆలస్యమయ్యే అవకాశమున్నందున ఇంతవరకు కేంద్రంనుంచి పెండింగ్‌లో ఉన్న 2 వేల 873 కోట్లు, 2023 జూన్ వరకు ప్రాజెక్టుపై వెచ్చించాల్సిన నిధులూ కలిపి 7 వేల 228 కోట్ల రూపాయలు ఇవ్వాలని రాష్ట్రం కోరింది. దీనిపై ఒక కమిటీ పరిశీలించి 5 వేల 306 కోట్లకు సిఫార్సు చేసింది. ఈ నిధులు కేంద్ర ఆర్థికశాఖ ఆమోదించాక 20 వేల 398 కోట్లకన్నా కొంత ఎక్కువ ఉంది. తాగునీటి విభాగం నిధులు 4 వేల 36 కోట్లు కలిపితే ఆ లోపునే ఉంటాయి. ఈ నిధుల మంజూరు దస్త్రం ఇంకా ఆర్థిక శాఖవద్దే ఉంది. అది ఆమోదం పొందితే వచ్చే నిధులు కేవలం 19 వందల 42 కోట్లే. అవీ రాష్ట్రం ఇప్పటికే ఖర్చు చేసినవి, గుత్తేదారులకు చెల్లించాల్సిన బకాయిలే.
ఇవీ చదవండి