Protest Against GO No 1: వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్-1 రద్దు చేయాలని సీపీఐ, సీపీఎం రాష్ట్రంలో పలు చోట్ల పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. జీవో నెంబర్-1పై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు.. రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇదేవిధంగా ప్రజా వ్యతిరేక విధానాలను కొనసాగిస్తూ పోతే వైసీపీ ప్రభుత్వ ఆగడాలను అడ్డుకట్ట వేయడానికి సీపీఐ పార్టీ ఎక్కడికి అక్కడ ప్రజా ఉద్యమాలు చేస్తూ ముందుకు పోతుందని హెచ్చరించారు.
జీవో నెం.1ను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. చీకటి జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అనంతపురం జిల్లా గుంతకల్లులో సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం జీవో కాగితాలను దహనం చేశారు. గుంతకల్లు సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి వీరభద్ర స్వామి మాట్లాడుతూ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభల్లో కార్యకర్తలు చనిపోవడం అన్ని రాజకీయ పార్టీలకు ఇబ్బందికరమైన పరిస్థితి అని, అయితే జరిగిన దుర్ఘటన సాకుగా చూపి జీవో నెంబర్-1 తేవడం అన్యాయమన్నారు. అంతేకాకుండా మీడియా ముఖంగా ఎప్పుడు నాకు పత్రికలు లేవు అని చెప్పుకునే ముఖ్యమంత్రి సచివాలయ సిబ్బందికి ప్రతినెల 200 రూపాయలు ఇస్తూ కేవలం సాక్షి పేపర్ని తీసుకోవాలని చెప్పడం ఎంతవరకు సమంజసం అన్నారు. ఈ విధంగా ప్రతినెల రాష్ట్ర ప్రజాధనం రూ.96 కోట్లు వృధాగా పోతుందని తెలిపారు.
రహదారులపై ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించకుండా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవోను నిరసిస్తూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల వద్దకు వెళ్లి రాజకీయ పార్టీలు తమ సిద్ధాంతాలు తెలియజేయడం, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నిరసన తెలపడం వంటి కార్యక్రమాలు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం హరింపజేయడం అన్యాయమని సీపీఎం నాయకులు పేర్కొన్నారు. తక్షణం ఈ జీవోను ఉపసంహరించుకోవాలని వీరు డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వీరు ధర్నా నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు.
అరాచక పాలన తెర లేపారు: నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీవో నెంబర్ 1ని తీసుకువచ్చి రాష్ట్రంలో అరాచక పాలనకు తెర తీశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. 33 సంవత్సరాలుగా కుప్పం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడం అప్రజాస్వామీకం అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పులివెందుల పర్యటనకు వెళ్లకుండా అడ్డుకుంటే ఎంత తప్పో.. చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడం కూడా అంతే తప్పన్నారు. యుద్ధ ప్రాతిపదికన జీవోను వెనక్కి తీసుకోవాలి లేదంటే రాబోయే రోజుల్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఇవీ చదవండి