Tiger dead.. నంద్యాల జిల్లా వెలుగోడు మండలం వెస్ట్‌బీట్‌లోని.. బుడుగుల వాగు సమీపంలో నల్లమలలో పులుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారులు.. గోప్యంగా శవపరీక్ష జరపడం అనుమానాలకు తావిస్తోంది. ఈ నెల 8న వెలుగోడు రేంజ్‌లో మృతి చెందిన పెద్దపులి.. ఏప్రిల్‌లో ఇలా రాజసంగా తిరుగుతూ అటవీ అధికారుల కెమెరాలో కనిపించింది. అయితే ఇటీవల చివరకు ఉచ్చు మెడకు బిగుసుకుని జీవన పోరాటం చేసి.. ప్రాణాలు విడిచింది.
ఇప్పటివరకూ.. తెలుగుగంగ కాల్వలో 2, 3 పులుల మృతదేహాలు కొట్టుకురావడంపై.. అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మేలో బైర్లూటి రేంజ్, పెద్ద అనంతాపురం బీట్‌లోని నల్లమల అటవీ ప్రాంతంలో కుళ్లిన స్థితిలో లభ్యమైన పెద్దపులి మృతదేహానికి.. అధికారులు పోస్ట్‌మార్టం చేసి గోప్యంగా దహనం చేశారు. ఇక గత నవంబరులో చలమ రేంజ్ రుద్రవరం బీట్ పరిధిలోని టీజీపీ ఉపకాలువలో గుర్తించిన పులి మృతికి.. కారణాలు తేలలేదు. 2018లో శ్రీశైలం రేంజ్ పెచ్చెర్వు బీట్ నరమామిడి చెరువు ప్రాంతంలో ఒక పెద్ద పులి.. 2017లో వెలుగోడు పరిసరాల్లో పులి పిల్ల మృతి చెందింది. 2014 ఆగస్టులో దోర్నాల మండలం ఐనపెంట వద్ద.. అటవీ అధికారులు రెండు పులి చర్మాలు స్వాధీనం చేసుకున్నారు.
ఈ నెల 8న వెలుగోడు రేంజ్‌లో పెద్దపులి మరణానికి.. ఉచ్చు వేయడమే కారణమని ఆత్మకూరు ఇన్‌ఛార్జి డీఎఫ్ఓ విజ్ఞేష్ అపావ్ తెలిపారు. వేటగాళ్లను పట్టుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
నల్లమలలో పులుల వృద్ధి 60 శాతం పెరిగిందని గొప్పలు చెబుతున్న అధికారులు.. పులుల మృతులను అరికట్టటంలో విఫలమవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవీ చదవండి: