Save The Tiger Representatives Participated In Yuvagalam Padayatra : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 99వ రోజు నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో కొనసాగుతోంది. వెలుగోడు అటవీ ప్రాంతంలో సాగుతున్న యువగళం పాదయాత్రలో సేవ్ ది టైగర్ క్యాంపెయిన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇండియా వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ సొసైటీ అసిస్టెంట్ డైరెక్టర్ ఇమ్రాన్ సిద్ధిఖీ, సీనియర్ జర్నలిస్ట్ పులిపాక బాలు ఈ మేర లోకేశ్‌ని కలిసి తమ సంఘీభావం తెలిపారు. అటవీ ప్రాంతంలో పులుల సంరక్షణకు ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించారు. అడవులను, పులులు, ఇతర వన్య ప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని నారా లోకేశ్ స్పష్టం చేశారు.
టీడీపీ హయాంలో పైలట్ ప్రాజెక్టులు.. ప్రత్యేక చర్యలు : అడవులు తరిగిపోవడం వలనే విపరీత వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయని నారా లోకేశ్ అన్నారు. టీడీపీ హయాంలో అడవుల సంరక్షణ కోసం అనేక చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు. మియావాకి మోడల్లో ప్రతి నియోజకవర్గంలో మినీ అడవులు తయారు చెయ్యాలని టీడీపీ హయాంలో పైలట్ ప్రాజెక్టులు కూడా చేసామని, శ్రీశైలం టైగర్ రిజర్వ్ సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
వణ్య ప్రాణులను కాపాడడమే లక్ష్యం : సేవ్ ది టైగర్ క్యాంపెయిన్‌లో భాగస్వామ్యం అయినందుకు ఇమ్రాన్ సిద్దిఖీ, పులిపాక బాలుకు లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. పులుల సంరక్షణ కోసం ఎంతో కాలంగా తాము కృషి చేస్తున్నామని, భావి తరాలకు ప్రకృతిని అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు వివరించారు. బెటర్ లైఫ్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్ అనే కాన్సెప్ట్‌తో అడవులు, పులులు, ఇతర వణ్య ప్రాణులను కాపాడడమే లక్ష్యంగా అనేక సంస్థలతో కలిసి పని చేస్తున్నామని ఆయన అన్నారు.
టైగర్ ఏకో టూరిజం ఏర్పాటు : ఇతర రాష్ట్రాల్లో టైగర్ ఏకో టూరిజం సర్క్యూట్స్ అభివృద్ది చెయ్యడం ద్వారా అడవులు, పులుల సంరక్షణ కోసం ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయని గుర్తు చేశారు. టైగర్ ఏకో టూరిజం ఏర్పాటు వలన అటవీ ప్రాంతాల్లో నివసించే వేలాది మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని స్పష్టం చేశారు.
వైఎస్సార్ స్మృతి వనం వద్ద నివాళులు : యువగళంలో భాగంగా నారా లోకేశ్ వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించారు. యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేశ్ చెంచు కాలనీ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. నల్లకాల్వ పంచాయతీ వైఎస్సార్ స్మృతి వనం వద్దకు చేరుకోగానే దివంగత వైఎస్సార్ విగ్రహాన్ని చూసి బయటి నుంచే నివాళులు అర్పించారు. అనంతరం పాదయాత్ర ముందుకు కదిలింది.
ఇవీ చదవండి