Nallamala forest national highway road accident: నల్లమల అడవిలోని జాతీయ రహదారిపై ఘోరం జరిగింది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బిడ్డను కాపాడుకునేందుకు ఓ తండ్రి చేసిన హాహాకారాలు.. అరణ్య రోదనలే అయ్యాయి. ఓ పక్క భార్య విగతజీవిగా పడి ఉండగా.. తనకూ గాయాలై విలపిస్తున్నా.. దారిన వెళ్లే వాహనదారుల్లో ఒక్కరు కూడా కనికరించలేదు. రక్తమోడుతున్న పసిపాపను ఆస్పత్రిలో చేర్చండయ్యా అని మొర పెట్టుకున్నా వినిపించుకునే నాథుడే లేడు. చాలాసేపటి తర్వాత ఓ కారు యజమాని స్పందించి.. ఆస్పత్రికి తరలించినా.. అప్పటికే ఆలస్యమవడంతో పసిపాప ప్రాణాలు విడిచింది. దీంతో ఆ తండ్రి రోదన ఆసుపత్రిలో ఉన్నవారికి కంటతడి పెట్టించింది.
వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లా పాములపాడు మండలం ఇస్కాల గ్రామానికి చెందిన జంబులయ్య, మైమ దంపతులు. వీరికి సరిత, సాత్విక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనారోగ్యంతో బాధ పడుతున్న కుమార్తెకు చికిత్స చేయించేందుకు.. ఆదివారం బైక్‌పై మైమ స్వస్థలమైన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నల్లగట్టకు బయల్దేరారు. నల్లమల అడవిలో ఆత్మకూరు మండలం బైర్లూటి దాటిన తర్వాత.. వేగంగా వచ్చిన ఓ జీపు వీరి వాహనాన్ని దాటుకుని వెళ్లింది. అదే సమయంలో ఎదురుగా R.T.C బస్సు రావడంతో హఠాత్తుగా జీపు వేగం తగ్గించారు. అనుకోని పరిణామంతో జంబులయ్య బైక్ అదుపుతప్పి కింద పడింది.
ఈ ప్రమాదంలో మైమ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయింది. చిన్నారి సాత్విక ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడింది. దీంతో ఆ తండ్రి తన బిడ్డను కాపాడుకునేందుకు ఆ రోడ్డుపై వెళ్తున్న అన్ని వాహనాలను ఆపేందుకు ప్రయత్నాలు చేశారు. శివరాత్రి సందర్భంగా వేల వాహనదారులు వెళ్తున్నా.. ఒక్కరు కూడా కనికరించలేదు. చివరికి శ్రీశైలం నుంచి ఎమ్మిగనూరు వెళుతున్న శ్రీనివాస నాయుడు తన కారు ఆపి.. మైమ మృతదేహంతో పాటు జంబులయ్యను, చిన్నారి సాత్వికను ఎక్కించుకున్నారు.
వీలైనంత త్వరగా ఆత్మకూరు వైద్యశాలకు చేర్చారు. అయితే.. రోడ్డుపై చాలాసేపు రక్తమోడిన సాత్విక.. ఆసుపత్రికి చేరే సరికి ఆలస్యమై మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. ప్రమాదం జరగ్గానే ఎవరైనా దయచూపి వాహనంలో ఆసుపత్రికి తరలించేందుకు సహకరించి ఉంటే.. తన కుమార్తె బతికేదంటూ జంబులయ్య తీవ్రంగా రోదించారు.
ఇవీ చదవండి